సిరీస్‌ను కైవసం చేసుకున్న కొహ్లీ సేన

11:52 - January 7, 2019

భారత్‌‌కు 316  పరుగుల ఆధిక్యం.. పిచ్‌ పరిస్థితిని బట్టి చూస్తే ఆసీస్‌ మూడు సెషన్ల పాటు బ్యాటింగ్‌ చేయడం కష్టమే.. అయితే చివరి రోజు ఆట సజావుగా సాగుతుందా? లేదా? అని అంతా అనుకుంటున్న సమయంలో సిడ్నీలో వరుణదేవుడు రానే వచ్చాడు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో కోహ్లీ సేన 2-1 తేడాతో సిరీస్‌ను కైవశం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించడంతో పాటు సిరీస్ ఆసాంతం రాణించిన పుజారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ఈ సిరీస్ విజయంతో భారత్ 72 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. టీమిండియా 1947లో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించింది. అప్పటి నుంచి పదిసార్లు అక్కడ పర్యటించింది. ఇప్పటి వరకు మొత్తంగా ఎనిమిది సార్లు ఓడితే, మరో మూడు సార్లు '  డ్రా '  చేసుకొని రావడం తప్ప ఒక్కసారి కూడా సిరీస్‌ గెలుపు రుచి చూడలేదు. ఈ రికార్డును ఇప్పుడు కోహ్లీ సేన బ్రేక్ చేసింది. అలాగే, ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి. అంతేకాదు, ఈ సిరీస్‌లో భారత్ ఎన్నో రికార్డులను నమోదు చేసింది. నాలుగోరోజు236/6 తో ఆట కొనసాగించిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్‌ యాదవ్‌ (5/99) ఐదు వికెట్లతో చెలరేగాడు.322 పరుగుల ఆధిక్యం దక్కడంతో కోహ్లి ఆసీస్‌కు '  ఫాలోఆన్‌ ' ఆడించాడు. అయితే, వర్షం, వెలుతురులేమి కారణంగా 25.2 ఓవర్ల ఆట మాత్రమే జరగడంతో ఆసీస్‌ పోరాటం చివరి రోజుకు చేరింది. కానీ, చివరి రోజు మొత్తం వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ ప్రారంభం కాలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు ఐదో రోజు ఆటను రద్దు చేశారు. దీంతో నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో భారత్ సిరీస్‌ నెగ్గింది.