ఆధారాలు చూపిస్తే శిక్షిస్తాం: పాక్‌

13:32 - March 1, 2019

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ వెంటే నిలిచాయి. దీంతో ఒంటరైన పాక్ తాము అదుపులోకి తీసుకున్న భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్‌ను శుక్రవారం భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించింది. అదే సమయంలో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన పుల్వామా దాడి చేసిన జైష్-ఎ-మహమ్మద్ సంస్థను, దాని అధినేత మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే డిమాండ్లు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ ఒక ప్రకటన చేసింది. భారత్ వద్ద మసూద్‌కు వ్యతిరేకంగా ఏవైనా ఆధారాలుంటే తమకు చూపాలని, తాము వెంటనే అతనిపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి హామీ ఇచ్చారు. మసూద్ అజర్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని అంగీకరించారు. పాకిస్తాన్ ఎటువంటి ఉగ్ర చర్యలనూ అనుమతించబోదని స్పష్టం చేశారు. అయితే మసూద్ ఆరోగ్యం బాగాలేదని, కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేకపోతున్నారని తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటే భారత ప్రభుత్వం కచ్చితమైన ఆధారాలు చూపాలని వెల్లడించారు.