కూల్ కుమారస్వామి: ప్రభుత్వం కూలిపోతున్నా ఆయన ధీమా ఏమిటి?

06:03 - January 16, 2019

కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు హెచ్.నగేష్, ఆర్.శంకర్ లు మద్దతును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్ కమల్ చేపట్టిందనే ప్రచారం నేపథ్యంలో, ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ నేతలు చెప్పినట్లుగానే. 15 న ఇద్దరు ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంగరించుకోవటమే కాకుండా కమలానికి దగ్గరయ్యారు.

ఈ ఇద్ద‌రిలో ఒక‌రు మంత్రి కూడా. అట‌వీశాఖ మంత్రిగా ఉన్న స్వ‌తంత్ర ఎమ్మెల్యే ఆర్ శంక‌ర్ ఉత్త‌ర క‌ర్ణాట‌క‌లోని రాణిబెన్నూరు, హెచ్ న‌గేష్..ముళ‌బాగిలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, మంగళవారం మధ్యాహ్నానికి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు వస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వరప్ప నిన్న ఢిల్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

 మ‌ద్దతును ఉప‌సంహ‌రించుకున్న ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా త‌మ లేఖ‌ను ముంబై నుంచే క‌ర్ణాట‌క రాజ్‌భ‌వ‌న్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. 
 అయితే ఇంత జరుగుతున్నా  ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం కూల్ గా ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ గురించి మాట్లాడుతూ, ఇద్దరు పోయినంత మాత్రాన భయపడాల్సిందేమీ లేదని, తమ ప్రభుత్వం సుస్థిరంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇద్దరి మద్దతు పోయినంతం మాత్రాన మ్యాజిక్ ఫిగర్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదని, తాను చాలా రిలాక్స్ గా ఉన్నానని, తన బలమేంటో తనకు తెలుసని, గత వారం రోజులుగా మీడియాలో వస్తున్నదంతా చూసి ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు.  భారతీయ జనతా పార్టీ నుంచి 104 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, కాంగ్రెస్ 80, జేడీఎస్ 37, బీఎస్పీ నుంచి ఒకరు, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 113.