ఇండో-పాక్ సరిహద్దుల్లో భారత యుద్దవిమానాల మోత

21:48 - February 16, 2019

*పోఖ్రాన్ వద్ద భారత్-పాక్ సరిహద్దులో భారీ విన్యాసాలు

*విన్యాసాలను తిలకించిన క్రికెటర్  సచిన్ టెండూల్కర్

*AHL, ఆకాశ్‌లను మోహరించడం ఇదే తొలిసారి

 

 

 

పుల్వామా ఎటాక్ తర్వాత భారత్ తన దాయాది దేశానికి హెచ్చరికలని పంపించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పాక్ ఏమాత్రం తోక జాడించినా భారీ నష్టం చూడాల్సి వస్తుంది అని చెప్పకనే చెప్పినట్టు. భారత వాయుసేన శనివారం రాజస్థాన్ లోని పోఖ్రాన్ వద్ద భారత్-పాక్ సరిహద్దులో భారీ విన్యాసాలు చేపట్టింది. ఈ ప్రదర్శణలో ఫైటర్ జెట్స్, అటాక్ హెలికాప్టర్లు సహా అన్ని రకాల యుద్ధ విమానాలతో భారత వాయుసేన తన శక్తి సామర్థ్యాలని చాటింది. వీటితోపాటు అప్‌గ్రేడ్ చేసిన మిగ్-29 యుద్ధ విమానాలు కూడా ఈ విన్యాసాల్లో పాలు పంచుకున్నాయి.

ఎస్-30, మిరాజ్ 2000, జాగ్వార్, మిగ్-21, బైసన్, మిగ్-27, మిగ్-29, ఐఎల్ 78, హెర్క్యులస్, ఏఎన్-32 తదితర మొత్తం 137 యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, భారత వాయుసేన గౌరవ గ్రూప్ కెప్టెన్ అయిన క్రికెటర్  సచిన్ టెండూల్కర్ తదితరులు విన్యాసాలను తిలకించారు.  రెండు రోజుల కిందట జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఆత్మాహుతి బాంబుదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు హతులయ్యారు. సరిగ్గా ఈ ఘటన జరిగిన రెండేరోజుల్లో భారత వాయుసేన ఈ విన్యాసాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
భారత దేశటెక్నాలజీతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం(ఎల్‌సీఏ) తేజాస్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్), భూమిపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగలిగే "ఆకాశ్", గాలిలోనే లక్ష్యాలను చేదించే "అస్త్ర" వంటివాటితో విన్యాసాలు నిర్వహించారు. ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు రాత్రీ, పగలు తేడా లేకుండా లక్ష్యాలను ఛేదించాయి. మిలటరీ విన్యాసాల్లో AHL, ఆకాశ్‌లను మోహరించడం ఇదే తొలిసారి.