హైదరాబాద్‌లో మరో ప్రేమోన్మాది: ప్రేమించలేదని కత్తితో దాడి

15:19 - February 6, 2019

హైదరాబాద్ లో మరో దారుణం జరిగిపోయింది. త్యాగానికి నిదర్శనంగా ఉండాల్సిన ప్రేమ పైశాచికంగా మారటం ఇటీవల కాలంలో చూస్తున్నదే.కోరుకున్నది సొంతం కావాలన్న దుర్మార్గమైన వైఖరి ఈ మధ్య కాలంలో అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో కక్ష కట్టిన  డిగ్రీ చదువుతున్న కుర్రాడు ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై కొబ్బరిబొండాం కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెలితే...బర్కత్ పురా సత్యానగర్ కు చెందిన విద్యార్థికి ఒకరు ఇంటర్ చదువుతోంది. ఆమెను అదే ప్రాంతానికి చెందిన భరత్ కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను ప్రదర్శించే ప్రయత్నంలో ఆమెను అడ్డుకోవటం.. ఒత్తిడి చేసేవాడు. తాజాగా మరోసారి ప్రేమించాలని ఒత్తిడి చేయటం.. ఆమె కాదని చెప్పటంతో కోపంతో ఊగిపోయిన భరత్.. వెంటనే తనతో తెచ్చుకున్న కొబ్బరిబొండాం కత్తితో ఆమె మెడపై వేటు వేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.ఈ దారుణాన్ని చూసిన చుట్టుపక్కల వారు వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మలక్ పేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్నబాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.