పాక్ లో దేవాలయ ధ్వంసం: విచారణకు ప్రధాని ఆదేశం

18:28 - February 6, 2019

మతం ఎక్కడైనా మతమే.. మెజారిటీ మతం ఎప్పుడూ మైనారిటీ వర్గాన్ని చిన్న చూపు చూస్తూనే ఉంటుంది. అది ఏదేశమైనా కావచ్చు ఏ మత జనాభా ఎక్కువ ఉంటే ఆ వర్గానికి చెందిన ప్రభుత్వమే ఏర్పాటవుతుంది. అధికారం మీద ఇంతగా ప్రభావం చూపుతుంది కాబట్టే ఏ మతానికా మతం తాను జనాభా పరంగా నిలదొక్కుకోవాలన్న తపనతో ఉంటాయి. మతప్రచారాలూ, మిగతా మతాల మీద దాడులూ మొదలవుతాయి. ఏమిటి? భారత దేశ చరిత్ర గురించి చదువుతున్నట్టు ఉందా? 
   అచ్చంగా మన దేశం కాకపోయినా మన దాయాది దేశం అయిన పాక్ లోనూ మెజారిటీ, మైనారిటీ మతాలున్నాయి. అయితే అక్కడ మనదానికి పూర్తి వ్యతిరేకం అన్నమాట అంటే ఇస్లాం మెజారిటీ మతం అయితే హిందువులు మైనారితీలు. అప్పుడప్పుడూ అక్కడ ఈ మైనారిటీ మతం మీద కొన్ని దాడులు తప్పవు. 22 కోట్ల పాకిస్థాన్ జనాభాలో హిందువులు రెండు శాతం ఉన్నారు. అందులో ఈ సింధ్ ప్రావిన్స్‌లోనే ఎక్కువ మంది హిందువులు ఉన్నారు.

ఇక్కడ తరచూ ఇస్లాం అతివాదుల కారణంగా వీళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. అలాగే ఈమధ్య పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు గుడిని ధ్వంసం చేశారు. ఆలయంలోని విగ్రహాలను ద్వంసం చేసి అక్కడి మత గ్రంథాలకు నిప్పంటించారు. ఖైర్‌పూర్ జిల్లాలోని కుంబ్‌లో గత వారం ఈ ఘటన జరిగింది. అయితే అంత పెద్ద విద్వంసం జరుగుతున్నా చుట్టుపక్కల వాళ్ళెవరూ గమనించకపోవటం అనుమానాస్పదంగానే ఉంది.

 ఈ ఘటనపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు.  ఇవి ఖురాన్‌కు పూర్తి వ్యతిరేకమైన చర్యలని ఆయన అన్నారు. ఇప్పటికే ఆలయం ధ్వంసమైన కేసులో అక్కడి హిందూ సమాజం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఓ నిరసన ర్యాలీ కూడా తీశారు. హిందూ దేవాలయాల సంరక్షణ కోసం స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ అడ్వైజర్ రాజేష్ కుమార్ హర్‌దాసాని డిమాండ్ చేశారు. గుడిపై దాడి చేసిన వారి కోసం వెతుకుతున్నామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.