ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్‌ క్లియర్‌...

13:13 - December 31, 2018


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు మార్గం సుగమం అయింది. ఏపీ హైకోర్టు విభజనకు మరింత సమయం కోరుతూ ఏపీ న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తరలింపును నిలుపుదల చేస్తూ అత్యవసరంగా ఆదేశాలు జారీచేయాలని హౌస్ మోషన్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదనీ, సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. జనవరి 2న ఇతర పిటిషన్లతో పాటు మామూలుగానే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీంతో ఏపీ న్యాయవాదులు, జడ్జీలు అమరావతికి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. దీంతో రేపు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ న్యాయమూర్తుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.