గ్రేటర్‌ కార్పోరేటర్ల ఫోన్‌ బిల్స్‌కు ఎంత తీసుకుంటున్నారో తెలుసా...?

12:56 - February 14, 2019

ప్రస్తుతం ఏ నెట్‌ వర్క్‌ను చూసుకున్నా...రూ.149 నుంచి రూ.199 చెల్లిస్తే..28 రోజుల పాటు అన్‌లిమిటెట్‌గా అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. అంటే ఏడాదికి రూ.1500 నుంచి రూ.1700 లోపు సరిపోతాయి. కానీ మన గ్రేటర్‌ కార్పోరేటర్ల ఫోన్‌ బిల్లు ఎంతవుతుందో తెలిస్తే షాకవ్వక తప్పదు. వివరాల్లోకి వెలితే...ఒకప్పుడు ఇన్‌ కమింగ్‌ కాల్స్‌కూ చార్జీ వసూలు చేసిన నెట్‌వర్క్‌ కంపెనీలు.. సేవల విస్తృతి పెరిగిన నేపథ్యంలో పోటీపడి మరీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. చవకగా అరచేతిలో ప్రపంచాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తున్నాయి. కానీ ఘనత వహించిన గ్రేటర్‌ కార్పొరేటర్లు మాత్రం ఇప్పటికీ టెలిఫోన్‌ బిల్లుల పేరిట నెలకు రూ.4000 తీసుకుంటున్నారు. గ్రేటర్‌లో 150 మంది కార్పొరేటర్లు, ఐదుగురు కో ఆప్షన్‌ సభ్యులు ఉన్నారు. వీరిలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను మినహాయిస్తే 153 మంది కౌన్సిల్‌ సబ్యులుగా కొనసాగుతున్నారు. గత పాలకమండలి సమయంలో రూ.4వేలుగా ఉన్న కార్పొరేటర్ల గౌరవ వేతనం రూ.6000కు పెంచారు. గౌరవ వేతనంతోపాటు రూ.4000 టెలిఫోన్‌ బిల్లు. మొత్తంగా ప్రతి నెలా ఒక్కో కార్పొరేటర్‌ బ్యాంకు ఖాతాలో రూ.10వేలు జీహెచ్‌ఎంసీ జమ చేస్తోంది. అయితే అసలు సమస్య ఇక్కడే వుంది. వారికి వచ్చే బిల్లుతో సంబందం లేకుండా ప్రతి నెలా రూ.4000 జమ చేయడం జరుగుతొంది. ప్రస్తుత మొబైల్‌ రీచార్జ్‌/పోస్ట్‌ పెయిడ్‌ కాల్‌ ధరలతో పోలిస్తే రూ.4000 ఎంతో ఎక్కువ. ఈ విషయంపై కనీసం చర్చించని సభ్యులు తాజాగా వేతనాల పెంపు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. కార్పొరేటర్‌ బడ్జెట్‌ కేటాయింపుతోపాటు వేతనాలు పెంచాలని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చ జరుగుతోన్న సమయంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌ మాట్లాడుతూ... బడ్జెట్‌, వేతనాల పెంపును ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొనగా... ఎంఐఎం సభ్యుడు సలీంబేగ్‌ మాత్రం ' మేం కేవలం బడ్జెట్‌ కేటాయింపు మాత్రమే కోరుతున్నాం.. వేతనాల పెంపుపై మాట్లాడలేదు' అని స్పష్టం చేశారు. మెజార్టీ టీఆర్‌ఎస్‌ సభ్యులు వేతనాలు పెంచాలని కోరుతుండడం గమనార్హం. గ్రేటర్‌లోని మెజార్టీ కార్పొరేటర్లు కోటీశ్వరులు. గౌరవ వేతనం, ఫోన్‌ బిల్లులపై ఆధారపడాల్సిన పరిస్థితిలో వారు లేరు. అయినా డబ్బు ఎవరికి చేదు.. అందుకే వచ్చినంతా తీసుకుంటూనే ఇంకా అదనపు ఆదాయం కోసం పరితపిస్తున్నారు. ఇదిలా ఉంటే మేయర్‌,డిప్యూటీ మేయర్‌ టెలిఫోన్‌ బిల్లు చెల్లింపునకు పరిమితి లేదు.