మాజీ రక్షణ మంత్రి కన్ను మూత: స్వైన్ ఫ్లూతో మృతి చెందిన జార్జ్ ఫెర్నాండేజ్

10:41 - January 29, 2019

  
మాజీ రక్షణ మంత్రి, జర్నలిస్ట్ అయిన జార్జ్ ఫెర్నాండేజ్ స్వైన్ ఫ్లూతో మృతిచెందారు. కొంతకాలంగా ఆయన అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఫెర్నాండేజ్‌కు అల్జీమర్స్ వ్యాధి కూడా ఉంది. ప్రస్తుతం ఫెర్నాండేజ్  వయసు 88 ఏళ్లు.  వాజ్ పేయి కేబినెట్‌లో రక్షణ శాఖ మంత్రిగా ఫెర్నాండేజ్ దేశానికి సేవలు చేశారు. 1998 నుంచి 2004 వరకు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో పాటు పరిశ్రమలు, రైల్వే శాఖల్లో కూడా ఆయన పనిచేశారు. అనారోగ్య కారణాలతో ఆయన చాలాఏళ్లుగా ప్రజలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 


1930 జూన్ 3న మంగళూరులో జన్మించిన ఆయన, 1967లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు, 1970వ ద‌శ‌కంలో సాగిన సొష‌లిస్టు ఉద్య‌మంలో ఫెర్నాండేజ్ కీల‌క పాత్ర పోషించారు. జ‌న‌తాద‌ళ్ నేత‌గా కూడా ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. జనతాదళ్ పార్టీలో కీలక నేతగా ఎదిగి, ఆపై సమతా పార్టీని స్థాపించారు.వాజ్ పేయి హయాంలో  రక్షణ శాఖతో పాటు సమాచార, పరిశ్రమల, రైల్వే శాఖలను కూడా నిర్వహించారు. 1975 ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ఫెర్నాండేజ్‌ను అరెస్టు చేసి సాధార‌ణ కార్య‌క‌ర్త‌ల‌తో జైలుకు పంపారు. 1977లో ఆయ‌న జైలు నుంచే ఎన్నిక‌ల‌కు పోటీప‌డి.. ముజ‌ఫ‌ర్‌పుర్ నుంచి అఖండ మెజారిటీతో గెలుపొందారు.  

.మొరార్జీ దేశాయ్ ప్ర‌భుత్వంలో కేంద్ర మంత్రిగా చేశారు. 1977 నుంచి 1980 వ‌ర‌కు మొరార్జీ దేశాయ్ ప్ర‌భుత్వం పాల‌న‌లో ఉంది. 2004లో కఫిన్ గేట్(శ‌వ‌పేటిక‌ల‌)స్కామ్ వ‌ల్ల ర‌క్ష‌ణ‌శాఖ‌కు ఫెర్నాండేజ్ రాజీనామా చేశారు. అయితే ఆ స్కామ్‌పై కోర్టు ఆఫ్ ఎంక్వైరీ సాగింది. ఆ కోర్టు ఫెర్నాండేజ్‌ను నిర్దోషిగా తేల్చింది. 

ఫెర్నాండెజ్ మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను  గుర్తు చేసుకున్నారు. ఫెర్నాండేజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో సుదీర్ఘకాఃలం ఉన్న ఆయన ఎప్పుడూ తన రాజకీయ సిద్దాంతాలతో ఎప్పుడూ రాజీపడలేదని తెలిపారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.