చైనాలో క్లోనింగ్ కోతులు: ఇక మీదట మనుషులేనా?

03:23 - January 26, 2019

దాదాపు 22 ఏళ్లకిందట మామూలు  ప్రపంచానికి మొదటిగా  పరిచయం అయిన  పదం క్లోనింగ్. ఆ పద్దతిలో ఓ గొర్రెపిల్లని పుట్టించారు. 1996లో స్కాట్లాండ్‌లోని రోజ్‌లిన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇయాన్ విల్మట్, కీత్ క్యాంప్‌బెల్ అనే శాస్త్రవేత్తలు గొర్రె పొదుగు కణాల ద్వారా డాలీ అనే గొర్రె పిల్లను సృష్టించారు.., డాలీ పుట్టుక  జన్యు రంగంలోనే గొప్ప సంచలనం. ఆ అద్భుత సృష్టితో సమూల మార్పులు సంభవించాయి. డాలీ సృష్టి కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు తెర‌తీసింది.

ఈ క్లోనింగ్ తో మనిషిని మళ్లీ అదే రూపంతో పుట్టించొచ్చు అని కనుగొన్నారు. మానవునిపై ఈ పరిశోధనకు ఇంకా అనుమతి లభించలేదు.దీంతో మొదట జంతువులపై ఈ పరిశోధనను ప్రారంభించారు. డాలీ ల్యాబ్ లోనే జీవం పోసుకుంది. డోర్సెట్ ఫిన్ షీప్ నుంచి తీసిన జ‌న్యువుల‌తో దీనిని పుట్టించారు. సుమారు 273సార్లు ప్రయత్నించిన త‌ర్వాత డాలీ పుట్టింది. అయితే పుట్టిన కొన్నేళ్ల‌కు సాధార‌ణ జీవుల‌క‌న్నా దీని వ‌య‌సు వేగంగా పెరుగుతూ వ‌చ్చింది. 2003 లో కీళ్ల నొప్పుల‌ వ్యాధి సోకింది. పుట్టిన త‌ర్వాత‌ ఆరు ఏళ్ల‌కే చ‌నిపోయింది. మొత్తంగా డాలీ జీవిత కాలం దాదాపు 10 ఏళ్లు.  

 అచ్చంగా అప్పుడు "డాలీ'ని పుట్టించిన సోమాటిక్‌ సెల్‌ న్యూక్లియర్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానంలోనే ఇప్పుడు చైనా పరిశోధకులు అయిదు కోతులను సృష్టించారు. మానవులు, కోతుల జన్యువులు దాదాపు ఒకే రీతిలో ఉన్నందున వ్యాధులపై పరిశోధనకు వీటిని సృష్టించినట్టు చెబుతున్నారు. జన్యుపరమైన జబ్బులైన క్యాన్సర్, అల్జీమర్స్, నిద్రలేమి, డిప్రెషన్, ఇతర జీవక్రియ సంబంధ వ్యాధుల పరిశోధనకు ఈ క్లోనింగ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.గతంలోనూ చైనా శాస్త్రవేత్తలు జోంగ్‌ జోంగ్‌, హువా హువా అనే కోతులను క్లోనింగ్‌ ద్వారా సృష్టించారు.  


అయితే క్లోన్ చేసిన వానరాలు అప్పుడే నెగెటివ్ బిహేవియర్ ని చూపుతున్నాయట.ద్రలేమి, యాంగ్జయిటీ వంటి లక్షణాలను అవి చూపుతున్నట్టు శాస్త్రజ్ఞులు తెలిపారు. కోతుల వరకూ వచ్చిన ప్రయోగం మనుషుల వరకూ రాకుండా పోదు. తొలుత జన్యు సంబంధమైన వ్యాధుల్ని అధిగమించేందుకు ప్రయోగాలు అని చెప్పినా.. తర్వాతి కాలంలో ఈ ప్రయోగాలు ఎక్కడి వరకూ వెళతాయన్నది పెద్ద ప్రశ్న.