146 రోజుల్లో 5,821 రైతులు మృతి: రైతు భీమా నివేదికలో చేదు నిజాలు

15:24 - January 10, 2019

రకరకాల స్కాములు, వందలకోట్ల స్కాములూ, శబరి మలలూ, రిజర్వేషన్ బిల్లులూ ఎన్నికల ముందు ఇప్పటికి మనమునున్న అతిపెద్ద సమస్యలివే. ఇవి ముక్యమైనవి కాదనలేము కానీ అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య ఇంకొకటుంది అదే రైతుల కష్టాలు. అన్ని రకాల వార్తల మధ్యా మనం విస్మరిస్తున్న ఒకే ఒక సమస్య "రైతు ఆత్మహత్యలు". నాలుగు నెలల కాలం లో తెలంగాణా రాష్ట్రం లో వివిధ కారణాల వల్ల మరణించిన రైతుల సంఖ్య ఎంతో తెలుసా అయిదు వేల పై చిలుకు. ఈ మాట  రాష్ట్ర వ్యవసాయశాఖ  స్వయంగా ఇచ్చిన నివేదికే చెబుతోంది. 

                 రాష్ట్రంలో వివిధ కారణాలతో రోజుకు సగటున 40 మంది రైతులు చనిపోతున్నారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ విడుదల చేసిన ‘రైతుబీమా’ నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు. 2017 ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో రైతు జీవిత బీమా పథకం ప్రారంభమైన విషయం విదితమే. ఇప్పటివరకు 146 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 5,821 రైతులు మృతి చెందారు.

             అంటే సగటున 40 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 5,525 మంది నామినీ ఖాతాలో రూ.5 లక్షల చొప్పున రూ.276.25 కోట్లు జమచేశారు. బుధవారం వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ఈ పథకంపై ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎల్‌ఐసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతిపాదనల్లో ఏమైనా తప్పులు ఉంటే జిల్లా నోడల్‌ అధికారులు చొరవ తీసుకొని, ఒక్కో కేసును పరిశీలించాలన్నారు.