మోదీ, కవిత మొదటి వాళ్ళేమీ కాదు, ఇలా తెలంగాణాలోనే రెండుసార్లు జరిగింది

13:14 - March 26, 2019

*మోదీకి వ్యతిరేకంగా 110 రైతుల రైతుల నామినేషన్లు

*ఎంపీ కవితకి వ్యతిరేకంగా నిజామాబాద్ రైతుల 236 నామినేషన్లు 

*ఆంద్రప్రదేశ్ (ఇప్పటి తెలంగాణా) చరిత్రలోనే రెండుసార్లు ఇలాంటి ఘటనలు 

 

ఈసారి లోక్ సభ ఎన్నికలలో అన్ని అంశాలకన్నా మోదీ పై 110 మంది తమిళ రైతుల నామినేషన్ల అంసమూ, తెలంగాణా రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత మీద 236 మంది రైతుల నామినేషన్లు వేయటం చర్చల్లో చోటు చేసుకుంది.  ఈ తరహా నిరసన కాస్త కొత్తగా అనిపించినా. ఇదే మొదటిసారి మాత్రం కాదు రెండుసార్లు ఇలా జరిగింది అదీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్న ఇప్పటి తెలంగాణా రాష్ట్రంలోనే. ఇంతకీ అది ఎప్పుడెప్పుడూ ఎక్కడా అంటే....  

1996లొ నల్లగొండలో  

గతంలో నల్లగొండ జిల్లాలోని ఎస్సెల్బీసీ కాలువను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు ఎంత ఉద్యమించినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆ రైతులంతా పార్లమెంటు ఎన్నికల్లో పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. 1996 లో నల్లగొండ ఎంపీ స్థానానికి 480 మంది రైతులు నామినేషన్ వేశారు. దీంతో అది అప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పుడు ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల మీదనే జరిగాయి. దీంతో దేశమంతా ఎన్నికలు జరిగినా నల్లగొండ ఎన్నికలు మాత్రం నెల ఆలస్యంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ నుంచి బొమ్మగాని ధర్మభిక్షం రెండో సారి ఎంపీగా ఎన్నికయ్యారు. 

2009 మహబూబ్ నగర్ లో 

ఆ తర్వాత 2009 లో మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి సెజ్ బాధితులు తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో మహబూబ్ నగర్ స్థానానికి పోటి చేశారు. దాదాపు 16 మంది బాధితులు నామినేషన్ వేశారు. తమ సమస్య పరిష్కారం కోసం వారు ఈ విధంగా వినూత్నంగా నిరసన చేపట్టారు. అప్పుడు కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్ రైతులు కూడా తమ సమస్య పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రైతులు తీసుకున్న నిర్ణయంతో టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. ఇక్కడి నుంచి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రైతుల చర్యలతో ఏకంగా ఎన్నికే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుండటంతో అధికార పార్టీ ఆందోళన చెందుతోంది. దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. నిజంగానే 1000 మంది రైతులు నామినేషన్ వేస్తే ఇది దేశంలోనే రికార్డు కానుంది.