పాస్ వర్డ్ ల విషయంలో ఆ ఘోర తప్పిదం నిజమే: అంగీకరించిన ఫేస్ బుక్

13:01 - March 22, 2019

*యూజర్లకి  మరో షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన సోషల్ మీడియా దిగ్గజం

*20,000 మంది ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు యూజర్ల పాస్వర్డ్స్ తెలుసు 

*2012కి ముందున్న పాస్‌వర్డ్‌లు మాత్రమే ఈ ప్రభవానికి లోనయ్యాయి 

 

ఇప్పటికే తన యూజర్ల డేటా భద్రత విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తాజాగా తన యూజర్లకి  మరో షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది.డేటా  భద్రతపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అందోళన వ్యక్తమవుతున్న తరుణంలో  తమ యూజర్ల  వందల మిలియన్ల పాస్‌వర్డ్‌లను తమ ఇంటర్నల్‌ సెర్వర్‌లలో దాచిపెట్టినట్టు గురువారం ధృవీకరించింది. అదికూడా భద్రతా నిబంధనలకు విరుద్ధంగా సులువుగా చదవగలిగిన (ప్లెయిన్‌ టెక్స్ట్‌) ఫార్మాట్‌లోనే యూజర్ల పాస్‌వర్డ్‌లు సర్వర్లలో నిక్షిప్తమయ్యాయని అంగీకరించింది.

ప్రతీ  ఏటా జరిపే భద్రత సమీక్షలో భాగంగా ఇంతవరకు దుర్వినియోగం అయిన దాఖలాలేవీ లేవని, ఈ ఏడాది కూడా ఈ ఘోర తప్పిదాన్ని కనిపెట్టలేకపోయామని, ఈ తప్పిదం తమ దృష్టికి రాగానే ఖాతాదారులకు  ఎలాంటి  ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామనీ తెలిపిన ఫేస్ బుక్ మరో భరోసా మాత్రం ఇవ్వగలిగింది. ఈ పాస్‌వర్డ్‌లు ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు తప్ప ఇతరుల చేతుల్లోకి వెళ్లలేదని స్పష్టం చేసింది. 

అయితే ఈ విషయం ఇప్పుడు కొత్తగా బయటికి వచ్చిందేమీ కాదు ఫేస్ బుక్ తన తరఫునుంచి ఈ తప్పిదాన్ని ఇప్పుడు అంగీకరించింది అంతే. నిజానికి సెక్యూరిటీ న్యూస్‌ వెబ్‌సైట్‌ క్రెబ్స్‌ఆన్‌సెక్యూరిటీ.కామ్‌ గతంలోనే ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. 20-60 కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల పాస్‌వర్డ్‌లు సాధారణ అక్షరాల్లోనే స్టోర్ అయ్యాయని, ఇవి ఎన్‌క్రిప్షన్ రూపంలో లేవని, 20,000 మంది ఫేస్‌బుక్‌ ఉద్యోగులు వీటిని చూడగలుగుతున్నారని వివరించింది. ఇదేవిషయాన్ని అంగీకరించిన ఫేస్ బుక్  ఇంజినీరింగ్‌, భద్రత, గోప్యత విభాగం ఉపాధ్యక్షుడు పెడ్రో కనహువాటి తన బ్లాగ్ లో ఈ విషయాన్ని చెబుతూ తమ ఉద్యోగులకు కనిపించేలా పాస్‌వర్డ్‌లు కలిగి ఉన్నఫేస్‌బుక్‌ లైట్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌  యూజర్లకు త్వరలోనే ఈ విషయమై  తగిన హెచ‍్చరికలు, సూచనలు జారీ చేస్తామనీ, యూజర్లు కూడా కొత్త పాస్‌వర్డ్‌లు పెట్టుకునేలా సూచిస్తామన్నారు. 

అయితే ఈ సమస్యవిషయంలో 2012తర్వాత పాస్వర్డ్ మార్చుకున్న, ఆ తర్వాత ఖాతాలు ఓపెన్ చేసుకున్న యూజర్లు ఆందోళన  చెందాల్సిన అవసరం లేదని  ముందు పెట్టుకున్న పాస్‌వర్డ్‌లు మాత్రమే ఈ ప్రభవానికి లోనయ్యాయని చెబుతున్నారు. ఎన్ని చెప్పినా ఇలాంటి యాప్ లవల్ల తమ సమాచారాన్ని భద్రంగా ఉంచుకోగలుగుతాం అని నమ్మటం మాత్రం కష్టమే.