ఎండపొడ -సత్య గోపి (కవిత)

00:50 - April 4, 2019

                                                     ఎండపొడ 

ఇక్కడేం ఉండదు. కొంత నిశ్శబ్దం రెక్కలు చాచి విశ్రాంతిలో వుంటుంది. నీడలు - నీడల తలలమీద చెట్లు - చెట్ల భుజాలపై వాన వాలిన అలికిడి - అలికిడి తెలీకుండా ఎండపొడ నవ్వుతున్న శబ్దం.

గాలి మెదలదు - దాని పరిమళం విహరించదు - కొన్ని నీలి పావురాలు నేలమీద గింజల కోసం తిరుగాడుతున్నాయి. ఆ నీలిపావురాలు వొదిలిన శ్వాస ప్రవహించి ఈ ప్రదేశం పరిశుభ్రమవుతుంది. నువ్వు నెమలి పాదాలతో సడి చేయకుండా వెళ్లి నీలిపావురం దేహాన్ని తడిమి దాని రంగుల్ని పట్టుకొస్తావు. నా కళ్ళకు రంగుపూసి నన్నొక నీలిచిలుకలా మార్చేసి కొన్ని మాటలు నేర్పిస్తావు. 

అనేకమైన మాటలు - అచ్చంగా నది ఒడ్డున రాళ్లను తాకి నీటి తరంగాలు చేసే శబ్దాలు - ఆ శబ్దాలు నింపిన మాటలు నేర్పిస్తావు - ఒక్కొక్క మాట, ఒక్కొక్క పదము, ఒక్కొక్క వాక్యము గడ్డిపూల రేకుల మీద అంటుకున్న వాన చుక్కలు మాట్లాడినవే...

నిశ్శబ్దం చేధించే మాటలవి - నీలోన మాటలు ఉదయిస్తున్న ఆకాశం కోసం నువ్వు - ఆ మాటల తాలూకు కదలికల్లో, నడకల్లో అన్ని సమాయాల్లోనూ, అన్ని ఋతువుల్లోనూ వాన - వాన అలికిడి - ఆ వాన అలికిడిలో నవ్వుతున్న నా శబ్దం 

నిజంగానే ఇక్కడేం ఉండదు - కొంత నిశ్శబ్దం రెక్కలు చాచి శబ్దాన్ని ఆవహించి నిదురపోతోంది - నువ్వు మెలకువ - మెలకువకు రూపమిస్తూ నేనొక ఎండపొడ.

                                                                                                                                                               కవి: సత్య గోపి