1570 మంది అభ్యర్థులపై ఈసీ వేటు....

18:12 - April 24, 2019

తెలంగాణ ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 1570మంది క్యాండిడేట్స్ ను ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు వేసింది. ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 291మంది అభ్యర్థులు జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. ఇక 1279మంది ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీపడకుండా అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయంతో వీరు ఇప్పుడు తెలంగాణలో జరిగే పరిషత్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేయకుండా పోయారు.  గత ఎన్నికల్లో పోలింగ్ తర్వాత ఇచ్చిన గడువు 45 రోజుల్లో వీరంతా ఎన్నికల్లో ఖర్చు చూపించలేదని.. అందుకే వీరు మరోసారి పోటీచేయకుండా అనర్హత వేటు వేశామని ఎన్నికల కమిషన్ ప్రకటనలో తెలిపింది.  ఈ దఫా పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల కమిషన్ ఖర్చు పరిమితిని రెట్టింపు చేసింది. ఈ ఎన్నికల్లో జడ్పీటీసీకి పోటీచేసే అభ్యర్థులు 4 లక్షల వరకు ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.5 లక్షల వరకూ ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పించింది. గడిచిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ మొత్తం జడ్పీటీసీలకు 1.5లక్షలు ఉండగా.. ఎంపీటీసీల ఖర్చు పరిమితి కేవలం 60వేల ఉండడం గమనార్హం.