ఆ దారుణాల వెనుక ఉన్నది ముఖ్యమంత్రేనా : బయటపడ్డ వరుస హత్యల గుట్టు ??

08:50 - January 12, 2019

తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు చెందిన కొడనాడు టీ ఎస్టేట్ బంగ్లా కొన్నేళ్ళ కిందట ఈ పేరు వింటేనే జనాల ఒంట్లో చలి పుట్టేది. జయ అక్రమ ఆస్తు ల కేసులో ఈ బంగ్లా ప్రస్తావన కూడా ఉన్నది. ఈ కేసులో జయలలిత, శశికళతోపాటు పలువురు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ బంగ్లాలో జయలలితకు సంబంధించిన కీలకపత్రాలు ఉంటాయని చెప్పుకునేవారు. ఈ నేపథ్యంలో మూడేళ్ళ కిందట ఆ బంగ్లాలో చోరీ, హత్యా జరిగింది. ఓ దుండగులు సెక్యూరిటీ గార్డును హత్యచేసి, మరొకరిని తీవ్రంగా గాయపరిచి కీలకపత్రాలు ఎత్తుకెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ.కనకరాజ్ 2012 వరకు జయలలిత కారు డ్రైవర్‌గా పని చేసాడు. 


   అయితే కొన్నాళ్ళకే కనకరాజు ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి స్నేహితుడు, ఈ కేసులో మరో నిందితుడు అయిన శ్యామ్ కేరళలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శ్యామ్ శనివారం తెల్లవారుజామున కారులో కుటుంబంతో కలిసి త్రిసూర్ నుంచి కోయంబత్తూర్ వెళ్తుండగా లారీ వీరి కారును ఢీకొట్టింది. పాలక్కడ్-త్రిసూర్ రోడ్డు పై జరిగిన ఈ ప్రమాదంలో శ్యామ్ భార్య విష్ణుప్రియ, కూతురు నీతు అక్కడికక్కడే చనిపోయారు. శ్యామ్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ రెండు ప్రమాదాలు ఒకేరాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే జరిగాయి. తర్వాత కొడనాడు ఎస్టేట్‌లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించే యువకుడు ఒకరు ఉన్నట్టుండి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇలా ఆ బంగ్లాతో సంబందం ఉన్న ఒక్కొక్కరే వరుసగా మరణించటమో, ప్రమాదాలకు గురి కావటమో జరిగింది. నెమ్మదిగా ఆ కేసు పక్కకు జరిగిపోయింది.

 మళ్ళీ ఇన్నాళ్ళకి కొడనాడు టీ ఎస్టేట్ బంగ్లా వార్తల్లోకి వచ్చింది కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన అనుమానాస్పద మృతుల మిస్టరీ వెనుక సీఎం ఎడప్పాడి పళనిస్వామి హస్తం ఉందని ఈ మిస్టరీలో నిందితుడిగా ఉన్న కేరళకు చెందిన సయాన్‌ సంచలన ఆరోపణ చేశాడు. ‘తెహల్కా’ మాజీ ఎడిటర్‌ మాథ్యూ శామ్యుల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సయాన్‌ కొడనాడుపై పలు విషయాలు వెల్లడించాడు.

అయితే, ఈ ఇంటర్వ్యూ తాలూకు వీడియోను తెహల్కా విడదల చేసింది. ఈ వరుస మరణాల వెనుక సీఎం ఎడప్పాడి ప్రమేయం ఉందని ‘తెహల్కా’ మాజీ ఎడిటర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సయాన్‌ బాంబు పేల్చాడు. కొడనాడుని దోచుకునేందుకు సయాన్‌, కనకరాజ్‌ ఆదేశాల మేరకు 10 మంది ప్రయత్నించారని స్థానిక డీఎంకే నాయకుడు ముబారక్‌ ఇటీవల ఆరోపించారు.

    ఈ క్రమంలో సయాన్‌ ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. ఇదిలావుంటే, తెహల్కా వీడియోపై మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది కుట్రపూరితమైన చర్య అని, నిందితుడిని ఇంటర్వ్యూ చేసిన తెహల్కా మాజీ ఎడిటర్‌పై కేసు వేస్తామని హెచ్చరించారు.