నమో టీవీ సంగతేంటి? : కేంద్రానికి ఈసీ నోటీసులు

04:31 - April 4, 2019

*ఎన్నికల వేల మోదీ చానెల్ కు ఎదురు దెబ్బ 

*ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నమో టీవీ చానల్ ఎలా ప్రారంభిస్తారు?

*‘మై భీ చౌకీదార్‌’ కార్యక్రమం విషయంలో దూరదర్శన్‌ ఛానెల్‌కి కూడా ఈసీ నోటీసులు

 

నమో టీవీ అంటూ ఎన్నికల ముందు తెచ్చిన మోడీ వ్యూహాన్ని ఎన్నికల కమీషన్ తప్పు పట్టింది. ఓవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నమో టీవీ చానల్ ఎలా ప్రారంభిస్తారంటూ కేంద్రానికి నోటీసులు పంపించింది, ఈ సమయంలో ఈ చానెల్ ప్రారంభించటం నిబంధనలకు విరుద్దం కాదా అంటూ ఈసీ ప్రశ్నించింది. ఈ ఛానల్ లోగోలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ఉండటం.. ఆయన ప్రసంగాలనే ప్రసారం చేస్తుండటం.. ఈ ఛానల్ ప్రారంభానికి ముందు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నారా? అని ప్రతిపక్షాలు ఈసీని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

                                                            
 ఇదే తరహాలో దూరదర్శన్‌ ఛానెల్‌కి కూడా ఈసీ నోటీసులు పంపించింది. ఆ ఛానెల్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న ‘మై భీ చౌకీదార్‌’ కార్యక్రమాన్ని గంటపాటు ప్రత్యక్ష ప్రసారం ఎందుకు చేశారో చెప్పాలని కోరింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్ అరోడా మార్చి 10న ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినప్పటి నుంచీ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది.


 కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నమో టీవీ ప్రారంభించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై వెంటనే స్పందించిన ఈసీ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను వివరణ కోరింది. దాంతో పాటు దూరదర్శన్ కు కూడా నోటీసులు జారీచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఓ కార్యక్రమాన్ని ఎందుకు ప్రసారం చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ సంజాయిషీ కోరింది.