రాజకీయ పార్టీలకు షాకిస్తున్న ఈసీ నిర్ణయం...

13:44 - March 17, 2019

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చే నిర్ణయాన్ని తీసుకుంది.  ఈసీ తీసుకున్న ఈ  నిర్ణయం రాజకీయ పార్టీలకు ఒక పట్టాన మింగుడుపడని రీతిలో ఉంటుందని చెప్పక తప్పదు. ఇంతకూ ఆ నిర్ణయం ఏమంటే.. పోలింగ్ కు 48 గంటల్లోపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించరాదని పార్టీలకు నిర్దేశించింది. తాజా నిర్ణయం ప్రకారం ప్రజాప్రతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126 ప్రకారం.. ఒకే దఫా లేదంటే పలు దఫాలుగా జరిగే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలయ్యే వేళలో రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోనూ విడుదల చేయకూడదు.  తాజాగా వెలువరించిన నిబంధన ఇప్పటివరకు అమలు చేయనిదిగా చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఈ ఏడు దశల్లో జరిగే ఎన్నికల పోలింగ్ కు 48 గంటల ముందు ఎన్నికల మేనిఫేస్టోను ప్రకటించటం కుదరదు.  2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ రోజునే బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ చర్య ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందంటూ కాంగ్రెస్ అభ్యంతరం తెలుపగా.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ఎన్నికల పోలింగ్ కు 72 గంటల ముందు పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించటం సరికాదంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీంతో.. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తననిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో.. ఎన్నికల మేనిఫేస్టోతో లబ్థి పొందాలని ప్లాన్ చేసే రాజకీయ పార్టీలకు తాజా నిర్ణయం షాకింగేనని చెప్పక తప్పదు.