రాష్ట్రాల ఆమోదం అనవసరం,ఈబీసీ బిల్లు అమల్లోకి: ఆర్థిక మంత్రి

05:18 - January 9, 2019

 దేశవ్యాప్తంగా సామాన్యప్రజల నుంచి సైతం వ్యతిరేకత వస్తున్న వివాదాస్పద "అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు" కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుపై రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఆమోదించిన వెంటనే బిల్లు చట్టం రూపంలో అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ‘రిజర్వేషన్లు 50 శాతం దాటితే కోర్టు కొట్టివేస్తుందని అంటున్నారు. ఆ ఆందోళన నిజమే.. అయితే ఇప్పటివరకు రిజర్వేషన్లకు ఆర్టికల్‌ 15, 16 కల్పించిన వెసులుబాటులే మూలం. ఆర్టికల్‌ 16(4)లో కులాల ఆధారంగా రిజర్వేషన్ల ప్రస్తావన ఉంది’ అని జైట్లీ వివరించారు. లోక్‌ సభలో మంగళవారం (జనవరి 8) ఈబీసీ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి సుధీర్గ ప్రసంగం చేసారు.  

రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్టికల్ 15, 16ను అర్ధం చేసుకోవడంలో కొంత గందరగోళం ఉందని చెప్పారు. ఆర్టికల్ 15 విద్యలో రిజర్వేషన్ల గురించి.. ఆర్టికల్ 16 ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించిన వివరణ ఉన్నట్లు చెప్పిన జైట్లీ.. రాజ్యాంగంలో సోషలిజం అనే పదం లేదని గుర్తు చేశారు. 50శాతం పరిమితి అనేది కేవలం కుల రిజర్వేషన్లకే అని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. వెనుకబాటుతనానికి కులమే అత్యుత్తమ ప్రాతిపదిక అని జైట్లీ చెప్పారు. EBC రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు
 
అయితే, ఈడబ్ల్యూఎస్‌ బిల్లును అన్నాడీఎంకే, మజ్లిస్‌ లు మాత్రం ఈ బిల్లుని నిర్ధ్వందంగా వ్యతిరేకించాయి, బిల్లును వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే వాకౌట్‌ చేసింది. సభలో ఈ రెండు పార్టీలు మినహా మిగిలిన పార్టీలన్నీ ఈడబ్ల్యూఎస్‌ బిల్లుకు మద్దతు ఇచ్చినా. ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చిన తీరును తప్పుబట్టాయి. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హడావుడిగా బిల్లును తెచ్చాయని, ఇది ఎన్నికల గిమ్మిక్కు అని, న్యాయ వివాదంలో చిక్కుకుంటుందని అభిప్రాయపడ్డాయి.

అయితే ఈ అనుమానాలకు సమాధానం చెబుతూ ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలన్నీ గతంలో ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాయని జైట్లీ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నాయని వివరించారు. అందువల్ల అన్ని పార్టీల సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరారు. కులాల ఆధారంగా కల్పించే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని చట్టంలో ఉందని.. అందువల్ల బిల్లుకు సంబంధించి పలువురు సభ్యులు సూచించిన సవరణలు చేయలేమని స్పష్టం చేశారు
  చివరగా ఈ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్ లో  లోక్‌సభలో మొత్తం 545 మంది సభ్యులు ఉండగా 326 మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో, ఈడబ్ల్యూఎస్‌ బిల్లును లోక్‌సభ ఆమోదించినట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. శీతాకాల సమావేశాలు ముగిశాయని, లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 
 
బిల్లును ఆమోదించినప్పుడు ప్రధాన మంత్రి మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇద్దరూ సభలోనే ఉన్నారు. కానీ, ఇద్దరూ బిల్లుపై మాట్లాడకపోవడం విశేషం. లోక్‌సభ ఆమోదంతో బిల్లు రాజ్యసభకు చేరనుంది. బుధవారమే దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టి చర్చిస్తారు. దాదాపు అన్ని పార్టీలూ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో, రాజ్యసభలో ఆమోదం కూడా లాంఛనమే అన్న అభిప్రాయమూ బలంగానే వినిపిస్తోంది.