జమ్మూకాశ్మీర్ లో భూకంపం, డిల్లి సహా కంపించిన పలు ప్రాంతాలు, పాక్ లోనూ..

23:54 - February 5, 2019

జమ్మూ కశ్మీర్‌లో కొన్ని గంటల క్రితం అంటే 5 ఫిబ్రవరి రాత్రి భూమి రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో కంపించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.17 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రకంపనల కారణంగా శ్రీనగర్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందారు. భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు పెట్టారు.

పలు భవనాల్లోని వస్తువులు కదిలాయని, కొన్ని చోట్ల పాత గోడలు కూలాయని తెలుస్తోంది. ఈ భూకంపం ప్రభావంతో దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు. శ్రీనగర్‌కు వాయువ్యంగా 118 కి.మీ. దూరంలో 40 కి.మీ. అడుగులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. దాదాపు ఇదే సమయంలో పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్, జమ్మూ కశ్మీర్లోని బండీపురలోనూ భూప్రకంపణలు చోటుచేసుకున్నాయి. గతనెలలో కూడా జమ్మూకాశ్మీర్ లో స్వల్ప భూకంపం రావటం తెలిసిందే.