మరో గ్రీన్‌గోల్డ్‌ మాయ: రూ.100 కోట్లు వసూళ్లు

11:21 - January 24, 2019

సాధారణంగా తక్కువ డబ్బులతో ఎక్కువ లాభం, డబ్బులు వస్తాయంటే మరో ఆలోచన లేకుండా డబ్బులు కట్టేస్తుంటారు. ఇలా కట్టడం వల్ల జరిగిన మోసాలను చూసి కూడా మళ్లీ అదే తప్పు చేస్తుంటారు. అలాంటిదే తాజాగా జరిగింది. వివరాల్లోకి వెలితే...అదో గొలుసు కట్టు కంపెనీ. అక్కడ రూ. లక్ష పెట్టుబడి పెడితే.. రెండేళ్లు తిరిగేసరికి 4.8 లక్షలు చేతికి వస్తాయి! వింటుంటేనే మంచి లాభం అన్నట్లుగా వుంది కదా!...మరి ఇంత లాభం వస్తుందంటే ఇక జనం ఆగుతారా...సమస్యేలేదు. అప్పు చేసయినా సరే ఆ లక్ష రూపాయలు కడతారు. ఈ నేపథ్యంలోనే పెట్టుబడిగా లక్ష ఇస్తే.. వేరుశనగ ఆడించే ఓ యంత్రం ఇస్తారు. చేయాల్సిందల్లా వారు ఇచ్చిన వేరుశనగలను ఆడించి నూనె తీయడం.. ఆ నూనెను, పిప్పిని కంపెనీకి అప్పగించడమే! వారు ఎప్పుడు వేరుశనగలిచ్చినా కాదనకుండా పట్టించి ఇయ్యాలి. ఇలా చేస్తే.. 24 నెలలపాటు నెలకు రూ.20వేల చొప్పున ఇస్తారు. గడువు తర్వాత యంత్రం కూడా మిగిలిపోతుంది. మరొకరిని చేర్పిస్తే రూ.20వేలు కమీషన్‌ అదనం! అంటే.. మొత్తంగా లక్షకు రెండేళ్లలో రూ.4లక్షల లాభం అన్నమాట!. ఈ శనక్కాయల పేరుతో ప్రజలను నిండా ముంచి రూ.100 కోట్ల దాకా దండుకుందా కంపెనీ! ఈ మేరకు ఉప్పల్‌ కేంద్రంగా గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌ పేరుతో జిన్నా శ్రీకాంత్‌ అనే వ్యక్తి పాల్పడిన భారీ మోసం ఇది! నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌కు చెందిన జిన్నా శ్రీకాంత్‌ ఈ కంపెనీ అధినేత! ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ పక్కనే అద్దెకు భవనాన్ని తీసుకొని.. ఏజెంట్లను పెట్టుకున్నాడు. లక్ష ఇస్తే.. అంతే ఖరీదు గల యంత్రం ఇస్తామని నష్టపోవడమనే ప్రశ్నే తలెత్తదని శ్రీకాంత్‌ జనాలను నమ్మించాడు. దీంతో మరింత ఎక్కువ లాభం కోసం ఆశతో కొందరైతే రూ.10లక్షలదాకా పెట్టుబడి పెట్టారు. ఒకరిని చూసి మరొకరు.. వేల సంఖ్యలో పెట్టుబడి పెట్టారు. అయితే, వారి నుంచి డబ్బులు తీసుకొని యంత్రాలయితే ఇచ్చాడు గానీ నెలవారీగా ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వలేదు. ప్రశ్నించిన పెట్టుబడిదారులను ఇదిగో.. అదిగో అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వేల సంఖ్యలో శ్రీనివాస్‌ మాటలకు మోసపోయారని తెలుస్తోంది. సరూర్‌నగర్‌ హుడా కాంప్లెక్స్‌కు చెందిన బాధితుడు ఇంద్రకిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ భారీ దందా భాగోతం బటయపడింది. ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు సంస్థ కార్యాలయంపై దాడి చేసి యజమాని జిన్నా శ్రీకాంత్‌తో పాటు, మరో నిర్వహకుడు భాస్కర్‌ ఇతర నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.