రనౌట్‌ మ్యాచ్‌ని తారుమారు చేసిన ధోనీ...

14:54 - February 4, 2019

న్యూజిలాండ్‌తో ఆదివారం జ‌రిగిన చివ‌రి వ‌న్డేలో మ‌హేంద్ర సింగ్ ధోనీ చేసిన ర‌నౌట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. న్యూజిలాండ్ గెలుపు దిశ‌గా సాగుతున్న స‌మ‌యంలో ధోనీ చేసిన రనౌట్ మ్యాచ్ గ‌తిని మార్చేసింది. భార‌త్‌కు విజ‌యాన్ని అందించింది. ఈ నేప‌థ్యంలో 'ధోనీ విష‌యంలో బ్యాట్స్‌మెన్‌కు స‌ల‌హాలు ఇవ్వండి 'అని ఓ నెటిజ‌న్‌ ట్విట‌ర్ ద్వారా ఐసీసీని కోరాడు. దీనికి స్పందించిన ఐసీసీ ' స్టంప్స్ వెనుక ధోనీ ఉన్నాడంటే ఎప్పుడూ క్రీజును వీడొద్దు ' అని స‌మాధానం ఇచ్చింది. 

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 37వ ఓవ‌ర్‌లో కేదార్ జాద‌వ్ విసిరిన బంతి బ్యాట్స్‌మెన్‌ నీష‌మ్ ప్యాడ్‌కు త‌గిలింది. దీంతో భార‌త ఆట‌గాళ్లు ఎల్బీడ‌బ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అంద‌రూ అంపైర్ నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. నీష‌మ్ కూడా క్రీజు బ‌య‌ట ఉండి అంపైర్ వైపే దృష్టి సారించాడు. ఈ ద‌శ‌లో ధోనీ బంతిని తీసుకుని అత్యంత వేగంగా వికెట్ల‌ను గిరాటేశాడు. దీంతో నీష‌మ్ ఆశ్చ‌ర్య‌పోయాడు. ఆ స‌మ‌యానికి న్యూజిలాండ్ విజ‌య ల‌క్ష్యం 83 బంతుల్లో 77 ప‌రుగులు. నీష‌మ్ దూకుడుగా ఆడుతూ అప్ప‌టికే 45 ప‌రుగులు చేశాడు. ఇక‌, న్యూజిలాండ్‌ విజ‌యం లాంఛ‌న‌మే అనుకుంటున్న త‌రుణంలో ధోనీ చేసిన ఈ ర‌నౌట్ మ్యాచ్ ఫ‌లితాన్ని తారుమారు చేసింది. దీంతో సోష‌ల్ మీడియాలో ధోనీపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.