మోడీ "విల్లా" కూల్చివేత

03:36 - January 26, 2019

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన అలీ బాగ్ లోని బీచ్ ఫ్రంట్ విల్లాను అధికారులు కూల్చివేస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బంగ్లా కూల్చివేతను ప్రారంభించారు. పీఎన్ బీకి బకాయిపడ్డ సొత్తు రికవరీలో భాగంగా ఈడీ అధికారులు రాయ్ గఢ్ జిల్లా అలీబాగ్ లోని నీరవ్ మోదీ బీచ్ విల్లా భవనాన్ని అటాచ్ చేసిన విషయం తెలిసిందే.  


రాయగఢ్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసు, అధికారుల బృందాలు కలెక్టర్ కార్యాలయం నుంచి బయలుదేరి విల్లాను కూల్చడం ప్రారంభించాయి. విల్లా కూల్చివేత ఆదేశాలు నిలిపేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. మోడీ ఆస్తుల్లో భాగంగా ఉన్న విల్లాను జప్తు చేసి బకాయిలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నామని ఈడీ అధికారులు చెప్పినదాంతో కోర్టు ఏకీభవించలేదు. దీంతో అధికారులు విల్లా కూల్చివేత విషయంలో ముందుకెళ్లారు.మోదీతో పాటు ఆయన మామ మోహుల్ ఛోక్సీకి చెందిన రెండు జ్వూలరీ గ్రూపులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు భారీ స్థాయిలో రుణాలను ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. ఇటీవ‌లే సీబీఐ పోలీసులు రెండవ చార్జ్‌షీట్‌ను నమోదు చేసింది.


 మోహుల్ ఛోస్కీ సుమారు 7వేల కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు సీబీఐ తన లేఖలో పేర్కొంది. రూ.512 కోట్లకు సంబంధించిన ఆరు లేఖలను కూడా సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పొందుపరించింది. ఐపీసీలోని సెక్షన్ 409, 420 కింద చార్జ్‌షీట్‌ను తయారు చేసింది. సీబీఐ తన చార్జ్‌షీట్‌లో ఛోస్కీని మోస్ట్ వాంటెడ్‌గా పేర్కొంది. 50 సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత సీబీఐ ఈ నిర్ధారణకు వచ్చింది. 12 లావాదేవీలు కూడా ఛోస్కీ చేసినట్లు తన నివేదికలో పేర్కొంది. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, గిల్లీ ఇండియా లిమిటెడ్, నక్షత్రా బ్రాండ్ లిమిటెడ్ సంస్థలపైన కూడా ఛార్జ్‌షీట్‌లు దాఖలు అయ్యాయి.


నీరవ్ మోదీ విల్లా 1986 నుంచి అక్కడ ఉందని..ఫాం హౌస్ నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని 2011లోఅప్పటి రాయ్ గఢ్ జిల్లా కలెక్టర్ డిక్లరేషన్ ఇచ్చారు. అయితే ఈ ఉత్తర్వులను ప్రస్తుత రాయ్ గఢ్ జిల్లా కలెక్టర్ విజయ్ సూర్యన్ వంశీ కొట్టిపారేశారు. నీరవ్ మోదీ విల్లా విషయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారని వెల్లడించారు. నీరవ్ మోదీ అలీబాగ్ లో అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా..కోస్టల్ రెగ్యులేషన్ జోన్ లో ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆయన విల్లా ఎదుట గార్డెన్ ను తయారు చేశారని చెప్పారు.