మరణించిన 130 ఏళ్ళ మొసలి: కన్నీరు మున్నీరైన గ్రామస్తులు

12:03 - January 10, 2019

ఊరికి దగ్గరలో ఉన్న చెరువులో మొసలి ఉంటే ఎలా ఉంటుందీ? పిల్లలలని అటువైపు వెళ్ళనివ్వటం తర్వాత అసలు పెద్ద వాళ్లైనా దైర్యం చేసి వెళ్ళగలరా? దాన్ని చంపేవరకూ లేదంటే అటవీ శాఖవారు వచ్చి పట్టుకుపోయే వరకూ అసలు నిద్రపడుతుందా? కానీ ఆ గ్రామసులు కొన్ని దశాబ్దాలుగా ఆ మొసలిని సొంత మనిషిలా చూశారు. దానికి అన్నం, పప్పూ పెట్టి ఇంటి మనిషిలా సాకారు. మీరు చదివింది నిజమే ఆ మొసలికి అన్నం, పప్పూ తినేది. పిల్లలూ మనుషులూ తన పక్కనే ఈదుతున్నా ఏనాడూ చిన్న పంటిగాటు కూడా వెయ్యకుండా వాళ్ళతో కలిసి జీవించింది. కానీ దానికీ ఆయుశ్శు తీరిపోయింది. ఒకటీ రెండూ కాదు 130 సంవత్సరాలు ఆ ఊరితో కలిసి బతికిన ఆ మొసలి మరణించింది. తమ కుటుంబసభ్యుడే మరణించినట్టు కన్నీరు మున్నీరవుతున్నారు ఆ ఊరి ప్రజలు. ఆ మొసలికి సర్వ లాంచనాలతో అంత్యక్రియలు చేసారు... 

 
 130 ఏళ్ల వయసున్న మొసలి మరణించిన ఘటనతో గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించిన విషాద ఘటన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీమిత్రా జిల్లా బవామొహత్రా గ్రామంలో వెలుగుచూసింది. బవామొహత్రా గ్రామంలోని కుంటలో మూడు మీటర్ల పొడవున్న మొసలి కళేబరానికి గ్రామస్థులు అంత్యక్రియలు జరిపించారు. మొసలి మరణించిందనే సమాచారంతో అటవీశాఖ అధికారులు పశుసంవర్ధకశాఖ వైద్యులను పిలిపించి దాని కళేబరానికి పోస్టుమార్టం జరిపించారు. అనంతరం మొసలి కళేబరాన్ని గ్రామస్థులకు అప్పగించగా వారు అంత్యక్రియలు జరిపించారని అటవీశాఖ అధికారి ఆర్కే సిన్హా చెప్పారు. 
         మొసలి కళేబరానికి పూలమాలలు వేసి, ట్రాక్టరుపై ఊరేగించిన గ్రామస్థులు తుది వీడ్కోలు పలికారు. తమ గ్రామంలోని కుంటలో ఉన్న మొసలి ఎవరికీ హాని తలపెట్టలేదని, కుంటలో పిల్లలు దాని పక్కనే ఈదుతున్నా ఏమీ చేయలేదని బవామొహత్రా గ్రామస్థులు చెప్పారు. తమ గ్రామంలోని కుంటలో పిల్లలు ఈదుతుంటే అందులో ఉన్న మొసలి మరో వైపునకు వెళ్లేదని వీర్ సింగ్ దాస్ అనే గ్రామస్థుడు చెప్పారు. 

తాము వడ్డించిన అన్నం, పప్పునే మొసలి తినేదని ఆయన పేర్కొన్నారు. మొసలికి తాము గంగారాం అని పేరు పెట్టి ముద్దుగా పిలుచుకునే వారమని, మొసలి వల్ల తమ గ్రామానికి మగర్ మచ్చావాలా గామ్ అనే పేరు వచ్చిందని గ్రామసర్పంచ్ మోహన్ చెప్పారు. మరణించిన మొసలికి గుర్తుగా గ్రామంలోని కుంట పక్కనే దాని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బవామొహత్రా గ్రామస్థులు ముక్తకంఠంతో చెప్పారు.