2018లో దళితులపై కొనసాగిన దాడులు ఎన్నో?....

16:50 - December 28, 2018

చరిత్ర గమనంలో మరో ఏడాది కలిసిపోతున్నది. ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా దళితులపై దురాగతాలు ఆగలేదు. మీసం పెంచారనీ, కాలుమీద కాలేసుకు కూర్చున్నారనీ.. కొట్టి చంపేశారు. భీమా కోరెగావ్‌లో ఉత్సవాలు జరుపుకుంటున్న దళితులపై హింస చెలరేగిన ఘటనతో నూతన సంవత్సరం ప్రారంభంకాగా.. చివరకు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చడంపై తమ నిరసనలను వ్యక్తంచేస్తున్నవారిపై కూడా దాడులకు పాల్పడిన ఘటనలు చరిత్రలో పుటల్లో లిఖించబడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, వెనుకబడి తరగతులు, మైనార్టీలపై దాడులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఎన్సీఆర్‌బీ గణాంకాలు దీన్ని మరింత స్పష్టంచేస్తున్నాయి.

2018 జనవరి 1 వరకూ భారతీయుల్లో చాలా మందికి బీమా కోరెగావ్‌ గురించి తెలిసిందే చాలా తక్కువ. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను అంతమొందించడానికి 1857లో దాదాపు దేశమంతటా తిరుగుబాటు జరిగింది. కానీ, అదే ఈస్ట్‌ ఇండియా కంపెనీ 200 ఏళ్ల కిందట సాధించిన ఓ విజయాన్ని ఉత్సవంగా అక్కడి దళితులు ఉత్సవంగా జరుపుకోవడం ఆనవాయితి. పేష్వా పాలకులు పంచములుగా భావించే మహర్లను పశువులకంటే హీనంగా చూసేవారు. మహార్ల సామాజిక, ఆర్థిక దుస్థితికి కారణమైన సామాజిక వ్యవస్థను కొనసాగించేందుకు కులవివక్షను ఎంతో కఠినంగా అమలు చేసేవారు. పేష్వాలకు నాయకత్వం వహించిన బాజీరావ్‌-2కు దాదాపు 28,000 మంది సైనికులు ఉన్నారు. బ్రిటీష్‌ ఆర్మీకి కేవలం 800 మంది సైనికులతో మాత్రమే ఉన్నారు. మహార్‌ సైనికులంతా ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరఫున పోరాడారు. ఈ యుద్ధం తర్వాతే పేష్వాల రాజ్యం అంతమైంది. పూణేకు సమీపంలోని భీమా కోరేగావ్‌ సమీపంలో ఉన్న స్తంభం పేష్వా సైన్యానికి వ్యతిరేకంగా అప్పటి మహర్‌ నేత ఏర్పాటుచేశారు. దళితులు ప్రతి ఏటా ఇక్కడ విజయోత్సవం జరుపుకుంటారు. 2018 200వ వార్షికోత్సవం కాబట్టి లక్షలాది దళితులు అక్కడికి చేరుకున్నారు. మహారాష్ట్రతోపాటు, దేశంయావత్తూ విస్తుపోయేలా గ్రామంలోని మూడు వైపులా అల్లర్లు చెలరేగాయి. వేలాదిమంది దళితులు గ్రామంలో చిక్కుకుపోయారు. జనవరి 3న, బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌, భారతీయ రిపబ్లికన్‌ బహుజన్‌ మహాసంఫ్‌ు (భరిప్‌) నాయకుడు మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ పూర్తిగా విజయవంతమైంది. కాగా, దాడికి నేపథ్యంలో చూస్తే..భీమా కోరెగావ్‌లో జరిగిన హింసాకాండకు ముందు 2017 డిసెంబరు 31న ఎల్గార్‌ పరిషత్‌ నేతృత్వంలో పూణేలోని షనివార్వదాలో దాదాపు 20,000 మంది ప్రజలు సమావేశమయ్యారు. బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి.జి కోల్స్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పిబి సావంత్‌, ప్రకాశ్‌ అంబేద్కర్‌ తదితరులు ఈ కారక్రమానికి నేతృత్వం వహించారు. ఎల్గార్‌ పరిషత్‌లో భాగమైన దాదాపు 150 సంస్థలు బీజేపీకి ఓటువేయబోమంటూ ప్రమాణస్వీకారం కూడా చేశాయి. దళిత నేత జిగేశ్‌ మెవానీ, జవహర్లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి నేత ఉమర్‌ ఖాలిద్‌ వంటి విద్యార్ధి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతుండగానే శ్రీ శివ ప్రతీష్ఠన్‌ హిందూస్థాన్‌ మరియు ధర్మవీర్‌ సంభాజీ మహారాజ్‌ ప్రతినిధి రైట్‌ వింగ్‌ నాయకులు శంభాజీ బిడే, మిలింద్‌ ఎకోబోట్‌ వంటివారు దాడులను ప్రేరేపించరేలా రెచ్చగొట్టినట్టు ఆరోపణలున్నాయి. దళితులపై జరిగిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ కేసు ఏవిధమైన ముందడుగూ పడలేదు. 

దళితులపై జరిగిన దాడులు... 

దళిత యువకుడు ప్రశాంత్‌ సోలంకి కలర్‌ఫుల్‌ బట్టలు వేసుకున్నాడు.. పెండ్లికి ముస్తాబయ్యాడు. వధువు ఇంటికి ఇంటికి అందంగా ముస్తాబుచేసిన గుర్రంపై బయలు దేరాడు. అది చూసి ఓర్వలేని అగ్రకులాలవారు ప్రశాంత్‌ సోలంకిపై దాడికి తెగబడ్డారు. మళ్లీ గుర్రమెక్కితే అందరినీ చంపేస్తామని బెదరించారు. భయపడిన సోలంకి పోలీసులను ఆశ్రయించాడు. చివరకు పోలీసుల రక్షణ మధ్య సోలంకి వివాహం జరిగింది. జూన్‌ 17న ఈ ఘటన జరిగింది. 

దళితులు తమ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారని ఆగ్రహించిన అగ్ర కులస్తులు ఒక దళిత బస్తీపై దాడిచేసి ఇద్దరిని హతమార్చిన ఘటన తమిళనాడులోని శివగంగై జిల్లాలో జరిగింది. ఈ కేసులో పోలీసులు 10 మందిని అరెస్ట్‌ చేశారు. తిరుప్పాకడి సమీపంలోని కచ్చనాథం గ్రామం మీద మే 28న రాత్రి జరిగిన ఈ దాడిలో షన్ముగం, ఆర్ముగం అనే ఇద్దరు దళితులు చనిపోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ''దళితులైన దేవేంద్రన్‌, ప్రభాకరన్‌లు ఆలయం వద్ద కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉండగా.. అటువైపు వచ్చిన చంద్రకుమార్‌, ఆయన కుమారులు ఇద్దరు వారితో గొడవకు దిగారు'' అని దాడి అనంతరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.

లైంగికదాడులు, భౌతికదాడుల్లోనూ దళిత మహిళలే అత్యధికమంది. మహారాష్ట్ర బుల్దానా తాలూకాలోని ఓ గ్రామంలో రాధాభాయి ఉంబాలక్చర్‌ (47) అనే మహిళపై తీవ్రంగా దాడిచేశారు. నగంగా ఊరేగించారు. ఆ ఘటన జరిగి పది నెలలైనా నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. 
కుర్చీలో కూర్చుందని దళిత మహిళపై దాడి చేశారు. గుజరాత్‌లో జూన్‌ 8న ఈ ఘటన జరిగింది. ఆధార్‌ కార్డు కోసం వెళ్ళిన ఆమె.. కుర్చీలో కూర్చోగా అప్పుడే వచ్చిన పెత్తందారులు కుర్చీలో కూర్చున్న ఆమె చెంప చెళ్లుమనిపించాడు. ఇక లైంగికదాడులు లెక్కనేనన్నీ... 
ఇదంతా బీజేపీ, ఆరెస్సెస్‌ భావజాలవ్యాప్తి ఎత్తుగడల్లో భాగమే. మోడీ పాలనలో ఏం తినాలో.. ఏం మాట్లాడాలో.. ఏ దుస్తులు వేసుకోవాలో.. ఏ చెప్పులు వేసుకోవాలో కూడా శాసిస్తున్నాయి హిందూత్వశక్తులు. దళితుల హక్కులను హరించే కుట్రలకు పాల్పడుతున్నారు. హక్కుల కోసం పోరాడుతున్న దళితులు ఐక్య ఉద్యమాలతో వారి ఆందోళనకు పదును పెట్టాలి.. పోరాడి సాధించుకోవాలి. పోరాడితే పోయేది ఏమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అన్న కమ్యూనిస్టు దిగ్గజం కారల్‌మార్క్స్‌ సూత్రాన్ని గుర్తెరగాలి.
ఇదంతా బీజేపీ, ఆరెస్సెస్‌ భావజాలవ్యాప్తి ఎత్తుగడల్లో భాగమే. మోడీ పాలనలో ఏం తినాలో...ఏం మాట్లాడాలో...ఏ దుస్తులు వేసుకోవాలో...ఏ చెప్పులు వేసుకోవవాలో కూడా శాసిస్తున్నాయి హిందుత్వశక్తులు. దళితులు హక్కులను హరించే కుట్రలకు పాల్పడుతున్నాఉ. హక్కుల కోసం పోరాడుతున్న దళితులు ఐక్య ఉద్యమాలతో వారి ఆందోళనకు పదును పెట్టాలి. పోరాడి సాధించుకోవాలి. పోరాడితే పోయేది ఏమీ లేదు....బానిస సంకెళ్లు తప్ప అన్న కమ్యూనిస్టు దిగ్గజం కారల్‌మార్క్స్‌ సూత్రాన్ని గుర్తెరగాలి. ఈ నేపథ్యంలోనే దళిత వ్యతిరేక ప్రభుత్వంపై దేశ రాజధానిలో దళితులు దళిత్‌ సోషల్‌ ముక్తి మంచ్‌ నేతృత్వంలో ఆగస్టులో నిరసనగళం విప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని విపక్షాల నేతలు హాజరై మద్దతు తెలిపారు.