సినిమా షూటింగ్ లో పేలుడు : తల్లితో సహా అయిదేళ్ళ చిన్నారి మృతి

12:15 - March 30, 2019

*"రణం" సినిమా షూటింగ్ లో పేలిన సిలిండర్ 

*కారును బ్లాస్ట్ చేసే దృశ్యాలను చిత్రీకరిస్తుండగా

*అయిదేళ్ళ పాప సహా తల్లి దుర్మరణం, మరో చిన్నారి పరిష్తితి విషమం 

 

సినిమా షూటింగ్ లో గ్యాస్ సిలిండర్ పేలటంతో షూటింగ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుల్లో అయిదేళ్ళ చిన్నారి సహా ఆమె తల్లి మృతిచెందగా, మరో పాప ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. నటుడు చిరంజీవి సర్జా నటిస్తున్న ‘రణం’ సినిమా చిత్రీకరణలో ఈ విషాదం జరిగింది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బెంగళూరులోని బాగలూరు వద్ద సినిమా చిత్రీకరణ జరుగుతుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో షూటింగ్ చూసేందుకు వచ్చిన సుమనా భాను (28), ఆమె ఐదేళ్ల పాప అయిషా ఖాన్ (5) ప్రాణాలు కోల్పోగా, ఆమె పెద్ద కుమార్తె జైనాబ్ (7) తీవ్రంగా గాయపడింది. షూటింగ్‌లో భాగంగా కారును బ్లాస్ట్ చేసే దృశ్యాలను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

నిజానికి ఈ షూటింగ్ కోసం అనుమతి కూడా తీసుకోలేదని, కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా రోడ్డు బ్లాక్ చేసి జనాలని దూరం వెళ్ళమని హెచ్చరిక కూడా చేయకుండా బ్లాస్టింగ్ చేయటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని సుమాన్ భర్త తబ్రేజ్ ఖాన్ ఆరోపించారు. డ్రైవర్‌గా తబ్రేజ్ తన భార్య పిల్లలతో అదే మార్గంలో వస్తుండంగా జనం గుమిగూడి ఉన్నారు. తాము కూడా షూటింగ్ చూస్తామని సుమనా భాను, పిల్లలు పట్టుబట్టడంతో అతడు వాహనాన్ని పక్కన నిలిపాడు. ఆ సమయంలో తబ్రేజ్ కారుదగ్గరే ఆగిపోవటంతో అతనికి మాత్రం, ఏ అపాయమూ జరగకుండా తప్పించుకున్నాడు. 

  ఈ దుర్ఘటనపై నటుడు చేతన్ కుమార్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శిస్తానని చెప్పాడు, ప్రమాదం అతనను చాలా కలచివేసిందని ఆవేదన చెందుతూ మీడియాతో మాట్లాడాడు. అయితే  పేలుడు అనంతరం చిత్ర యూనిట్ అక్కడి నుంచి పరారైనట్టు ఏసీపీ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు.

అంతే కాదు ఈ ప్రమాదం సంగతి తెలిసి కూడా నటుడు చిరంజీవి సర్జా మరో షూటింగ్‌ కోసం మైసూర్ వెళ్లిపోవడం పలువురు అభిమానులని అసంతృప్తికి గురి చేసిందిఒ. షూటింగ్‌ సమయంలో ఎలాంటి రక్షణపరమైన చర్యలు తీసుకోకపోవడంతో తరుచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.