సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న కీలక ఉగ్రవాది హతం...

12:44 - February 18, 2019

పుల్వామా ఎన్‌కౌంటర్‌లో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రదాడి ఘటనలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది హతమయ్యాడు. పింగ్లాన్ ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ కమాండర్ కమ్రాన్ ఘాజీని భారత సైన్యం  మట్టుబెట్టింది. అతడు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ నాయకుడైన మసూద్‌ అజార్‌కు అత్యంత నమ్మకస్థుడు! మంచుకొండల్లో నెత్తుటి ధారలు పారించిన కరడుగట్టిన ఉగ్రవాది ఆదిల్‌ అహ్మద్‌ దార్‌కు గురువు! పుల్వామా ఉగ్రదాడి పాత్రధారి ఆదిల్‌ అయితే అతడి వెన్నంటి నడిపించిన సూత్రధారి!! అతడే జైషే మహ్మద్‌ కమాండర్‌ ఘాజీ అబ్దుల్‌ రషీద్‌. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి వెనుక ఐఈడీ నిపుణుడైన అతడి హస్తం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. అతడే ఆదిల్‌కు ఆత్మాహుతి శిక్షణ ఇచ్చినట్లు అనుమానిస్తున్నాయి. జైషే మహ్మద్‌ కమాండర్లలో అత్యంత నమ్మకస్థుడిగా పేరొందాడు రషీద్‌. 2008లో జైషేలో చేరాడు. అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్‌ శిక్షణ తీసుకున్నాడు. 2010లో పాకిస్థాన్‌లోని నార్త్‌ వజీరిస్థాన్‌ చేరుకున్నాడు. ఉగ్రవాద భావజాలానికి ప్రభావితమై జైషేలో చేరిన పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)కు చెందిన యువకులకు శిక్షణ ఇస్తున్నాడు. దక్షిణ కశ్మీర్‌లో నక్కి భారత్‌ నుంచి జైషే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.

2017, 2018 సంవత్సరాల్లో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ మేనల్లుళ్లు తలాహ్‌ రహీద్‌, ఉస్మాన్‌ హతమయ్యారు. దీంతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అజార్‌ రగిలిపోయాడు. ఈ బాధ్యతను రషీద్‌కు అప్పగించాడు. దీంతో రషీద్‌, మరో ఇద్దరు సహాయకులు గత ఏడాది డిసెంబరులో భారత్‌లోకి చొరబడినట్లు తెలుస్తోంది. గురువారం ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు రతిన్‌పొర గ్రామంలో మిలిటెంట్లు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో రషీద్‌ త్రుటిలో తప్పించుకున్నాడు. కానీ.. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైన్యం చేతిలో హతమయ్యాడు. కమ్రాన్‌తో పాటు మరో ఉగ్రవాది హతమయ్యాడు. సీఆర్‌పీఎఫ్‌పై దాడి జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ సహా నలుగురు జవాన్లు మృతి చెందడం శోచనీయం. జవాన్లపై దాడి తర్వాత ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉండటాన్ని సైనికులు గమనించారు. అదను చూసి కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.