ఉగ్రవాదికి మద్దతిస్తూ...మరో 40 మంది సైనికులు చనిపోతారంటూ ఫేస్‌బుక్‌ పోస్ట్‌...

13:59 - February 16, 2019

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్లకు జాతి జోహార్లు అర్పించింది. ' మీ త్యాగం.. సదా స్మరణీయం' అంటూ కొనియాడుతోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌పై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రాంతాలు, మతాలకు అతీతంగా భారత జాతిది ఇప్పుడు ఒక్కటే మాట.. ' మన వీర జవాన్ల త్యాగాలు వృథా కాకూడదు. ఉగ్రతండా పాకిస్థాన్‌ పీచమణచాలి.. దాని అంతుచూస్తే తప్ప లెక్క తేలదు.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే' అంటూ రగిలిపోతుంటే..బెంగుళూరులోని ఒక యువకుడు మాత్రం దీనికి విరుద్ధంగా ఉగ్రవాదికి మద్దతు పలుకుతూ...మరో 40 మంది సైనికులు భవిష్యత్తులో చనిపోతారని ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నాడు. వివరాల్లోకి వెలితే...బెంగళూరులో ఓ యువకుడు ' అసలైన సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటే ఇదే ' అని ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేయడంతో అతనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అతని ఫేస్‌బుక్‌లో ఉన్న సమాచారం అధారంగా ఆ యువకుడి పేరు అబిద్ మాలిక్ అని తెలుస్తోంది. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు అతని ఫేస్‌బుక్ ఖాతాలో ఉంది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈ యువకుడు ఉగ్రవాదుల దాడిపై తన ఫేస్‌బుక్‌ ఖాతాలో వ్యంగ్యంగా పోస్ట్‌ పెట్టడమే కాకుండా. అసలైన సర్జికల్‌ దాడి అంటే ఇదే అని అందులో ఎగతాళి చేశాడు. ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదిని పొగుడుతూ ' రిప్‌ బ్రో ' అనే వ్యాఖ్యలు కూడా చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. కశ్మీర్‌ సమస్యపై స్పందించకపోతే భవిష్యత్‌లో మరో 40మంది సైనికులు మరణిస్తారని పేస్‌బుక్ పోస్టు ద్వారా హెచ్చరించాడు. ఈ పోస్టు చూసిన నేటిజన్లు అతనిపై మండిపడ్డారు. తీవ్రత ఎక్కువకావడంతో అబిద్‌ తన ఖాతా నుంచి ఆ పోస్టును తొలగించి పరారీలో వున్నాడు. ఇదిలా వుంటే పోలీసులు అబిద్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు.