మొసళ్ళ మధ్య ముసలం: ఐక్యతా విగ్రహం చుట్టూ జీవవైవిధ్య విద్వంసం ?

02:36 - January 26, 2019


ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గుజరాత్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ)ని ఏర్పాటు చేసిన సర్దార్ సరోవర్ డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఈ పని అంత సులభమేమీ కాదేమో అనిపిస్తోందత అక్కడి అధికారులకి. కారణం ఆ చుట్టూ ఉన్న కొలనునుల్లో ఉన్న మొసళ్ళు ఒకటీ రెండూ కాదు వందల సంఖ్యలో ఉన్నాయట అక్కడ మొసళ్ళు. ఇప్పటికే సీ ప్లేన్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చి పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అక్కడ విపరీతంగా ఉన్న మొసళ్ళ వళ్ళ పూర్తి స్థాయిలో ఆ ప్రయత్నాలు ముందుకు సాగటంలేదు. స్థానికంగా ఉన్న మగర్ తాలాబ్ (మొసళ్ళ చెరువు) లోనే ప్రభుత్వం ఈ  సీ-ప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి ఇక్కడికి సీ ప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఈ మొసళ్ళ జనాభా అక్కడ అధికంగా ఉన్నంత కాలం ఈ ప్రయత్నాలేవీ ఫలించవు.
 
దీనిమీద రకరకాల ఆలోచనలు చేసిన ప్రభుత్వం అక్కడ ఉన్న మొసళ్ళని వేరే ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించుకుందట. కానీ  అక్కడి నుంచి మొసళ్లను ఎక్కడికి తరలించాలన్న విషయమే అంతుపట్టటం లేదు ఒకటీ రెండూ అయితే ఏ జూలకో తరలించవచ్చు గానీ ఇన్ని వందల మొసళ్ళని ఎక్కడికి తీసుకుపోతారు? ఇలా మళ్ళీ కొంత చర్చ జరిగాక చివరికి అటవీశాఖకు ఆ పనిని అప్పగించింది. అంతే కాదు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని షెడ్యూల్-1లో ఉన్న ఈ మొసళ్లను తరలించడానికి ముందు పౌర విమానయాన విభాగం, గుజరాత్ ప్రభుత్వం కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేశాయి డ్యామ్ పరిసరాల్లో ఉన్న కొలునుల్లో దాదాపు 500 వరకు మొసళ్లు ఉన్నట్టు గుర్తించిన అటవీ అధికారులు మంగళవారం నాటికి చేపలు, మాంసం ఎరగా వేసి 15 మొసళ్లను బంధించారు. 
 దీనిపై పర్యావరణ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పటేల్ విగ్రహం వద్దకు సీప్లేన్ రూట్ రూపొందిస్తున్నామని, మొసళ్లు అడ్డంగా ఉండడంతో వాటిని పట్టుకుని నర్మాద సరోవర్ డ్యామ్‌కు తరలిస్తున్నామని అంటున్నారు. అయితే ఇవి అంతరించిపోతున్న మొసళ్లని, ఇప్పుడు హఠాత్తుగా వాటి ఆవాసం మారితే వాటి సంఖ్య మరింత తగ్గిపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.   
 
 ఇప్పటి వరకు 15 మొసళ్లను పట్టుకున్న అటవీ సిబ్బంది మిగతా వాటిని పట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. పట్టుకున్న మొసళ్లను డ్యామ్ రిజర్వాయర్‌లో విడిచిపెట్టాలా? లేక మరో ప్రాంతంలో వదిలిపెట్టాలా? అన్నది ఇంకా నిర్ణయించలేదని అధికారులు పేర్కొన్నారు. అలాగే, మొత్తం మొసళ్లను ఎప్పటిలోగా తరలించాలన్న దానిపై డెడ్‌లైన్ కూడా ఏదీ లేదన్నారు.  మొత్తానికి ఐక్యతా విగ్రహం అక్కడ జీవ వైవిధ్యాన్ని హరించే  దిశగా పయనిస్తోందన్న  మాట