244 పరుగుల లక్ష్యం: భారత్‌ సిరీస్‌ను చేజిక్కించుకున్నట్లే...!

13:12 - January 28, 2019

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న టీమిండియా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలోనూ మెరుగైన స్థితిలో నిలిచింది. ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు (సోమ‌వారం) మౌంట్ మాంగ‌నుయ్‌లో ప్రారంభ‌మైన మూడో వ‌న్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు భార‌త బౌల‌ర్లు ఆదిలోనే షాకిచ్చారు. బౌల‌ర్లు రాణించ‌డంతో న్యూజిలాండ్‌ను 49 ఓవ‌ర్ల‌లో 243 ప‌రుగులకు ఆలౌట్ చేసింది భారత్‌. మూడో వ‌న్డేతోనే సిరీస్ విజేత‌గా నిలిచే అవ‌కాశాన్ని సృష్టించుకుంది. కివీస్ నిర్దేశించిన 244 ప‌రుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను భార‌త్ చేజిక్కించుకుంటుంది.

ప్రారంభంలోనే గ‌ప్తిల్ (13( ను భువ‌నేశ్వ‌ర్‌, మ‌న్రో (7)ను ష‌మీ, విలియ‌మ్స‌న్ (28) ను చాహ‌ల్ పెవిలియ‌న్‌కు చేర్చారు. దీంతో న్యూజిలాండ్ క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో కివీస్ జ‌ట్టును టేల‌ర్ (93),లాథ‌మ్ (51) ఆదుకున్నారు. వీరిద్ద‌రూ స‌మ‌యోచితంగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 119 ప‌రుగులు జోడించారు. అయితే లాథ‌మ్‌ను అవుట్ చేసి ఈ జోడీని చాహ‌ల్ విడ‌దీశాడు. అప్ప‌ట్నుంచి న్యూజిలాండ్ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోతూ భారీ స్కోరు సాధించే అవ‌కాశాన్ని జారవిడుచుకుంది. వ‌రుస ఓవ‌ర్ల‌లో నికోల‌స్ (6) సాంట్‌న‌ర్ (3) ల‌ను పాండ్యా అవుట్ చేశాడు. కొద్ది సేప‌టికి సెంచ‌రీకి చేరువ‌వుతున్న టేల‌ర్‌ను, ఆ వెంట‌నే సోదీ (12) ని ష‌మీ అవుట్ చేశాడు. అనంత‌రం బ్రాస్‌వెల్ (15) ను కోహ్లీ ర‌నౌట్ చేశాడు. ఇక‌, చివ‌రి బ్యాట్స్‌మెన్‌గా బౌల్ట్ (2) భువీ బౌలింగ్‌లో అవుట‌య్యాడు. దీంతో న్యూజ‌లాండ్ 49 ఓవ‌ర్ల‌లో 243 ప‌రుగుల‌కు ఆలౌటైంది.