' RRR ' కథ లీకయినట్టేనా?

12:45 - November 13, 2018

రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి రాజ్‌మౌలీ తెరకెక్కిస్తున్న చిత్రం ' ఆర్‌ఆర్‌ఆర్‌ '. అయితే దీనికి ఇంకా టైటిల్‌ ఇదే అని కన్ఫామ్‌ కాలేదు. ఈనెల 11న ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఆరంభమే ఈ సెట్స్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రణాళికలు సిద్ధం చేశారు. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది. బాహుబలిని మించి.. 300 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే చిత్రం కథ లీకైయినట్లు టాక్‌ వస్తుంది. ఇంతకీ కథ ఏంటి? అన్న డిస్కషన్ మెగా-నందమూరి అభిమానుల్ని వేడెక్కిస్తోంది. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే బోలెడంత ప్రచారం సాగింది. ఇదో పీరియాడికల్ సినిమా. ఇందులో చరణ్ - ఎన్టీఆర్ బాక్సర్లుగా నటిస్తున్నారని ఇదివరకూ సామాజిక మాధ్యమాల్లో కథను లీక్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశాన్ని రాజమౌళి ఎంచుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టును అందించారు. ఇది దొంగా పోలీస్ కథ. ఇందులోనే బాక్సింగ్ నేపథ్యం ఇన్ బిల్ట్ చేశారట. 1920 లో సాగే ఆసక్తికర కథాంశమిది. చరణ్ - ఎన్టీఆర్ లుక్ పరంగా చాలా కొత్తగా కనిపిస్తారని చెబుతున్నారు. ఈనెల 19 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. ఆరంభమే ఎన్టీఆర్ - చరణ్ పై దొంగా పోలీస్ ఛేజ్ దృశ్యాల్ని తీస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఒక రకంగా ఇదే నిజమైతే కథ లీక్ చేసినట్టే. జక్కన్న ప్రాజెక్టుకి ఆర్కా మీడియా - వారాహి చలనచిత్రం అంతటి పెద్ద సంస్థల వెన్నుదన్ను ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ అండదండలు ఉండనే ఉన్నాయి. ఇండియాలోని అన్ని భాషల్లో అనువదించి రిలీజ్ చేయనున్నారు.  అలానే `బాహుబలి` సిరీస్ తో వచ్చిన గుర్తింపు  సక్సెస్ వల్ల చైనా - జపాన్ లోనూ రిలీజ్ ప్లాన్ ఉందని ముచ్చటించుకుంటున్నారు.