9 మంది మహిళల్లో..ఏ ఒక్కరూ ఆలయంలోకి వెళ్లలేకపోయారు కారణం?

10:26 - October 22, 2018

ప్రకృతి అంటే నీరు, నింగి, గాలి, భూమి, అగ్ని ఇవన్నీ అందరికీ సమానంగా ప్రకృతిలో లభించేవి. వీటికి ఆడ, మగ అనే తేడా వుండదు. మరి ప్రకృతిలో ఏది జరిగినా ఆ పైవాడే చేస్తుంటాడు అని కనిపించని దేవుడుని తలుచుకుంటారు. మరి ఆ దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిలో ఎందుకు తేడా చూపించడం. ఆడ వారు ఇక్కడకి రాకూడదూ, అక్కడికి రాకూడదూ అని ఆంక్షలు ఎందుకు పెట్టాలి?..ఇవన్నీ ఇప్పుడు ముందున్న ప్రశ్నలు.
అసలు విషియానికి వస్తే శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును తప్పుపడుతూ బీజేపీ, శివసేన, ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి మతోన్మాదులు ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు, నిరసనలు చేపించి రాజకీయ లబ్ధి పొందుతున్నారు. మరికొందరు అయ్యప్ప బ్రహ్మచారి అందుకే అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించకూడదు అంటూ వాదిస్తున్నారు. బ్రహ్మచారికి తల్లి, చెల్లి వుండకూడదా? అలాంటప్పుడు అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే తప్పేంటి అని కొంత మంది వాదనలను వినిపిస్తున్నారు. స్త్రీకి అన్నింటిలో సమాన హక్కు ఉంది అని చెబుతున్న పాలకులకు ఈ అరాచకం కనబడటంలేదా?. ఇదిలా వుంటే ఆలయంలోకి స్త్రీలు అడుగు ముందుకేస్తే ఆత్మాహుతి చేసుకుంటామన్న శివసేన హెచ్చరిక మొదలు ప్రతిక్షణం పరిస్థితి ఉద్రిక్తమే. నెలవారీ పూజల కోసం ఈ నెల 17న ఆలయ ద్వారాలు తెరుచుకోగా ఆదివారం వరకు మొత్తం తొమ్మిది మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇందులో ఏ ఒక్క రూ స్వామిని దర్శించుకోలేకపోయారు. అయ్యప్ప దర్శనానికి వచ్చిన బాలమ్మ(47)అనే మహిళను ఆందోళనకారులు దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యింది. ఇక, సోమవారం అయ్యప్ప ఆలయ తలుపులు మూసుకోనున్నాయి. ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను ముస్లిం సమాజం బహిష్కరించింది.