59 ఏండ్ల రికార్డును బద్దలు కొట్టిన పృథ్వీ షా

11:40 - October 4, 2018

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత ఓపెనర్ పృథ్వీ షా హాఫ్ సెంచరీతో 59 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.తన ఆరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి అబ్బురపరిచాడు. సీనియర్ల గైర్హజరుతో రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన షా మొదటి నుంచీ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలోనే 56 బంతుల్లోనే ఏడు ఫోర్లతో కెరీర్‌లో మొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ దశలోనే భారత జట్టు తరపున అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు సచిన్, పార్థీవ్ పటేల్ ఈ ఘనత సాధించారు. అలాగే ఆరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 1959 లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగేట్రం చేసిన అబ్బాస్ అలీ తక్కవ వయసులో హాఫ్ సెంచరీ చేసిన రికార్డును పృథ్వీ ఇప్పుడు తిరగ రాశాడు. అంతేకాదు, ప్రపంచంలోనే ఓపెనర్‌గా తక్కువ వయసులో యాభై పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగానూ షా నిలిచాడు.