1 నుండి బంద్‌ అంటున్న మీ సేవ...ఇబ్బందుల్లో ఓటర్లు

11:43 - October 26, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు తెరతీసిన నేపథ్యంలో.. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచార సభలలో బిజీగా వున్నారు. ఇక ఓటర్లు సైతం వారి ఓటరు కార్టులను తీసుకునే పనిలో వున్నారు. ఓటరు జాబితాలో పేరు న్నా చాలామందికి ఓటరు కార్డు లేదు. తొలిసారి పేరు నమోదు చేసుకున్న వారికీ కార్డులు లేవు. వీరంతా ఆధారపడేది మీ-సేవ కేంద్రాలపైనే. అయితే ఇంతలో మీ సేవ సేవలు నవంబర్‌ 1 నుంచి బంద్‌ అవుతున్నాయనే ప్రకటన వెలువడింది. అసలు విషియానికి వద్దాం.. ప్రభుత్వ తీరుకు నిరసనగా మీ-సేవ ఆపరేటర్లు ఆం దోళనకు సిద్ధమవుతున్నారు. పదేళ్ల క్రితం ధరలు నిర్ణయించిన ప్రభుత్వం ప్రస్తుత ఖర్చును లెక్కలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలను సవరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 1నుంచి మీ-సేవ కేంద్రాలను మూసివేస్తామంటున్నారు. ఓటరు కార్డుల కోసం ప్రభుత్వం ఇస్తున్న కమీషన్‌ సమంజసంగా లేదని, దీన్ని వెంటనే సవరించాలని తెలంగాణ మీ-సేవ జేఏసీ గురువారం మీ-సేవ కమిషనర్‌ వేంకటేశ్వర్లును కోరింది. సమస్యలపై నాలుగేళ్లుగా విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, నష్టపోతూ వ్యాపారాలు చేయలేమని తెలిపింది. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుంటే నవంబరు 1 నుంచి సమ్మెకు వెళ్తామని తెలిపింది. ఓటరు కార్డులకు ఆపరేటర్లు రూ.25మాత్రమే వసూలు చేయాలి. ఇందులో ప్రభుత్వ వాటా, పన్నులు పోను మిగిలేది రూ.13మాత్రమే. ఖర్చు మాత్రం ఒక్కో పీవీసీ కార్డుకు రూ.35 వరకు అవుతోంది. నష్టం భరిస్తూ సేవలు అందించలేమని, ఎన్నికల కార్డు ధరతో పాటు ఇతర సేవల ధరలు పెంచకుంటే నవంబరు 1 నుంచి అన్ని కేంద్రాలు మూసివేయాలని తెలంగాణ మీ-సేవ జేఏసీ నిర్ణయించింది. ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఓటరు కార్డులు పొందేందుకు వీలుగా ఎన్నికల సంఘం త్వరలో అనుమతి ఇవ్వనుంది. ఓటర్ల జాబితాలో కొత్తగా 17లక్షల మంది చేరారు. వీరితో పాటు కార్డులు లేని వారు వాటి కోసం ఎక్కువగా ఆధారపడేది మీ-సేవ కేంద్రాలపైనే. ఆపరేటర్లు సమ్మెలోకి వెళ్తే ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. తెలంగాణలో తొలుత 500 కేంద్రాలు ప్రారంభించగా ఈ సంఖ్య 4,500 కు చేరింది. ఈ కేంద్రాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 300 రకాల సేవలు లభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువవ్వడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. అయితే, ఈ కేంద్రాలు ఏడాది కాలంగా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఆదాయం వస్తుండడంతో ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా మీ-సేవ కేంద్రాలకు అనుమతి ఇచ్చింది. వీటిలో అందే సేవలు ప్రభుత్వం ప్రారంభించిన టీ-యాప్‌ ఫోలియోలోనూ లభిస్తున్నాయి. దీంతో మీ-సేవ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలోని వెయ్యి కేంద్రాలు ఆధార్‌ సేవలు కూడా అందిస్తుండగా వాటిని ప్రభుత్వం ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు అప్పగించనుంది. ప్రతి సేవకు ఆపరేటర్లు వసూలు చేయాల్సిన ధరను ప్రభుత్వం 2008లో నిర్ణయించింది. నామమాత్ర కమీషన్‌లో 18 శాతం జీఎస్టీ, 5 శాతం టీడీఎస్‌ పేరుతో అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ధరలు పెరుగుతున్నా కమీషన్‌ను ప్రభుత్వం సమీక్షించకపోవడంతో ఆపరేటర్లు వినియోగదారుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదులు అందుతుండడంతో ధరలను సమీక్షించడం అటుంచి, ఏకంగా కేంద్రాల లైసెన్సులు రద్దు చేస్తోందని ఆపరేటర్లు ఆగ్రహంగా ఉన్నారు