హిట్లూ, ఫ్లాపులకు ప్రభావితం కాకుండా సినిమాలు చేయాలి: నాగ్‌

13:09 - September 23, 2018

ఆఫీసర్‌ రిలీజ్‌ తరువాత అక్కినేని నాగార్జున కొన్ని రోజులు మీడియా దొరకలేదు. ఎందుకంటే...బాక్సాఫీస్ దగ్గర ఘోర అవమానాన్ని మిగిల్చిన సినిమా ఆఫీసర్‌. గత దశాబ్ద కాలంలో రామ్ గోపాల్ వర్మ ట్రాక్ రికార్డు ఎంత దారుణంగా ఉందో తెలిసి కూడా అతడిని నమ్మాడు. ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ కోటి రూపాయల షేర్ కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతలో ' దేవదాస్‌ ' రావడంతో అందరి దృష్టి దానిపైకి వెళ్లిపోయింది. ' ఆఫీసర్‌ 'గురించి అంతరూ మరిచిపోయారు. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ్ తనకు తానుగా ‘ఆఫీసర్’ ప్రస్తావన తేవడం విశేషం. ఒక దర్శకుడి ట్రాక్ రికార్డు చూడకుండా.. అతడి వెనుక ఫెయిల్యూర్లు ఉన్నా కూడా ఎలా సినిమా చేయడానికి ఒప్పుకుంటారు అని ఆ ఇంటర్వ్యూలో నాగార్జునను ప్రశ్నిస్తే.. తనకు కొత్తదనం అంటే ఇష్టమని.. ఈ క్రమంలో కొన్ని ప్రయోగాలు.. సాహసాలు చేస్తుంటానని.. పెద్దగా ఆలోచించనని నాగ్ చెప్పాడు. సినిమా ఫలితం అన్నది తన ఒక్కడి చేతిలో ఉండదని.. రేపు ‘దేవదాస్’ పెద్ద హిట్ కావచ్చని.. ఐతే ఈ సినిమాతో పాటే తాను ‘ఆఫీసర్’ కూడా ఒప్పుకున్నానని.. అలాగే ‘మనం’ చేస్తున్నపుడే ‘భాయ్’ కూడా చేశానని.. అవి రెండూ పూర్తి భిన్నమైన ఫలితాలు అందుకున్నాయని.. ఏదీ మన చేతుల్లో ఉండదు అనడానికి ఇది రుజువు అని నాగార్జున అన్నాడు. హిట్లు ఫ్లాపులకు ప్రభావితం కాకుండా సినిమాలు చేసుకుంటూ పోతుండాలని.. తాను ఎప్పుడూ అదే చేశానని నాగ్‌ తెలిపారు.