స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో గద్డర్‌..

11:13 - October 9, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హాడావుడి మొదలైంది. అన్ని పార్టీల వారూ వారి వారి అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ప్రజా నాయకుడు గద్దర్‌ కూడా ఒక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో గజ్వేల్‌ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని గద్దర్‌ ప్రకటించారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. నేను పుట్టింది మెదక్‌ జిల్లా తూప్రాన్‌. గజ్వేల్‌ నుంచి పోటీకి ఆసక్తి ఉంది. ప్రజలు కోరుకుంటే.. మరే ఇతర ప్రాంతం నుంచైనా బరిలో నిలబడతానన్నారు.  అంతకంటే ముందు అన్ని పార్టీల నేతలు, ప్రజలను కలిసి మాట్లాడతా. నన్ను ఉమ్మడి అభ్యర్ధిగా నిలబెట్టాలని కోరతా. ప్రచారపర్వంలో సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందాయా? లేదా? అని ప్రశ్నిస్తా. తెలంగాణ వచ్చిన తర్వాత గుణాత్మక మార్పు వచ్చిందా? పరిణామాత్మక మార్పు వచ్చిందా? అని అడుగుతా. కేసీఆర్‌ ఏం చెప్పాడు? ఏం చేశాడు? అని ప్రశ్నిస్తా. 31 జిల్లాల్లో ప్రెస్‌మీట్లు నిర్వహిస్తా. దసరా తరువాత ప్రజల్లోకి వెళ్ళి.. వారిని చైతన్యపరుస్తా ..అని వివరించారు.