' సైరా ' టీజర్‌ అదిరిపోయింది

13:09 - August 22, 2018

చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, విజరు సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన చిరంజీవి తల్లి అంజనాదేవి, చిరంజీవి సతీమణి సురేఖ సంయుక్తంగా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి హావభావాలు, పోరాట స్ఫూర్తి ఆకట్టుకుంటున్నాయి. 'టీజర్‌ అదిరిపోయింది' అని అంజనాదేవి అన్నారు. 'టీజర్‌ చాలా చాలా బాగుంది. చెప్పడానికి మాటలు రావడం లేదు' అని సురేఖ తెలిపారు. 

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, 'సినిమా గురించి తెలుసుకోవాలని అంతా వెయిట్‌ చేస్తున్నారు. అందుకే టీజర్‌ను విడుదల చేస్తున్నాం. 12ఏండ్ల పరుచూరి బ్రదర్స్‌ కల ఇది. వారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ ప్రాజెక్ట్‌ గురించి నాన్నగారితో మాట్లాడమనేవారు. వారి తపన, నమ్మకంతోనే ఈ సినిమా సాధ్యమైంది. 'ధృవ' సినిమా విడుదల టైమ్‌లో యుఎస్‌లో ఉన్నప్పుడు ఈ కథ గురించి సురేందర్‌రెడ్డికి చెప్పా. తాను అర్థం చేసుకుని వారం రోజుల్లో చేస్తానని చెప్పారు. నాన్నతో కూర్చున్న ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే సినిమా ఓకే అయ్యింది. రత్నవేలు ఈ చిత్రానికి పనిచేయడం ఆనందంగా ఉంది. 
'మగధీర'కు విఎఫ్‌ఎక్స్‌ చేసిన కమల్‌కన్నన్‌ ఈ చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ చేస్తున్నారు. ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లందరికి కృతజ్ఞతలు. 

డాడీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కాబట్టి ఎంత బడ్జెట్‌ అయినా తీయాలనుకున్నా. ఈ చిత్రాన్ని నిర్మించడమనేది నాకు బ్లెస్సింగ్‌ లాంటిది. దక్షిణాది భాషలన్నింటిల్లోనూ వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. 'రంగస్థలం' చిత్ర కలెక్షన్లే కాదు, ఇతర సినిమాల కలెక్షన్లను దాటాలని, మా సినిమానే కాదు, ఇతర సినిమాలు కూడా భారీ కలెక్షన్లను రాబట్టాలని కోరుతున్నా' అని అన్నారు. ' చిరంజీవి నటిస్తున్నారని అమితాబ్‌ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. కథ విని డబుల్‌ ఎగ్జెట్‌ అయ్యారు. దర్శకుడనేవాడు ఏ జోనర్‌, ఏ కథ అయినా డైరెక్ట్‌ చేయగలగాలి. దర్శకుడు సురేందర్‌రెడ్డి సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.

'ఇండియన్‌ ఫస్ట్‌ ఫ్రీడమ్‌ ఫైటర్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం గురించి నాకు పెద్దగా తెలియదు. ఈ ప్రాజెక్ట్‌ అనుకున్నాక చాలా పరిశోధన చేశాం. గెజిట్‌లోని అంశాల ఆధారంగా వాస్తవానికి దగ్గరగా తెరకెక్కిస్తున్నాం. చిరంజీవి సినిమాల కోసం చొక్కా చించుకున్న రోజులున్నాయి. అలాంటిది ఆయన సినిమాను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ వస్తుందని ఊహించలేదు. బాలీవుడ్‌ మెగాస్టార్‌, టాలీవుడ్‌ మెగాస్టార్‌ ఇద్దరిని డైరెక్ట్‌ చేయడం ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇలాంటి సినిమాను మొదటిసారి చేస్తున్నా. సినిమా కోసం చిరంజీవి ఎంతో కష్టపడుతున్నారు. ఆయన్ని చూసినప్పుడు నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్థమైంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఓ ఎత్తు అయితే, ఇది మరో ఎత్తు' అని దర్శకుడు సురేందర్‌రెడ్డి తెలిపారు. 

పరుచూరి వెంకటేశ్వరరావుమాట్లాడుతూ..., ' చిరంజీవితో 'ఖైదీ' చిత్రం దగ్గర్నుంచి మా అనుబంధం కొనసాగుతోంది. ఈ సినిమా మా పదేండ్ల కల. ఇప్పటికి నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. చరణ్‌ ప్యాషనేట్‌ నిర్మాత. చాలా తెలివైనోడు. సురేందర్‌రెడ్డి సినిమాకు ప్రాణ ప్రతిష్ట చేశారు. టాప్‌ టెక్నీషియన్లు సినిమాకు పనిచేస్తున్నారు. సినిమా గొప్ప విజయం సాధిస్తుంది' అని అన్నారు.

 'చిరంజీవి నటించే సినిమాలకు డైలాగ్‌లు రాస్తానని కలలో కూడా ఊహించలేదు. 'ఖైదీనంబర్‌ 150', 'సైరా నరసింహారెడ్డి' చిత్రాలకు మాటలు రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఇది చరిత్ర సృష్టించడం ఖాయం' అని అన్నారు. ఈ చిత్ర టీజర్‌ను చిరంజీవి అమ్మగారు, చరణ్‌ అమ్మగారు కలిసి విడుదల చేశారు. తల్లి ఆశీస్సులను మించింది ఈ భూమ్మీద మరేది లేదు' అని బుర్రా సాయిమాధవ్‌ తెలిపారు.