సెల్ఫీ మరణాలను ఆపడమే ఆ యాప్‌ లక్ష్యం!

16:20 - November 13, 2018

అనుకోకుండా ప్రమాదాలు జరిగో, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగో చనిపోవడం సహజం. కానీ ఈ మధ్య కాలంలో సెల్ఫీలు పేరుతో కావాలనే ప్రమాదాలను కొని తెచ్చుకోని మరణించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. కొండ పైకెల్లి, రైల్వే ట్రాక్‌ మీద, జంతువులతోనూ, పాములతోనూ ఈవిధంగా అనేక మంది సెల్ఫీలు తీసుకుంటూ మరణాలని కొని తెచ్చుకుంటున్నారు. దీనిని ఎలాగైనా ఆపాలనే లక్ష్యంతో ఐఐటీ-రోపడ్‌ నడుంబిగించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో పనిచేసే ' గరుడ ' అనే యాప్‌ ను రూపొందించింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అభినవ్‌ ధాల్‌, విద్యార్థులు జితేందర్‌ సింగ్‌, హర్షవర్ధన్‌ డోగ్రాలు రూపొందించిన ఈ యాప్‌లో సెల్ఫీ మరణాలకు ఆస్కారమిచ్చే 11 వేల ఫొటోలను స్టోర్‌ చేశారు. సెల్ఫీ తీసుకునే వ్యక్తి చుట్టూ పొంచి ఉన్నప్రమాదాన్ని ' గరుడ ' పసిగడుతుంది. సెల్ఫీ తీసుకునేటప్పుడు సురక్షితం, కొంత ప్రమాదకరం, ప్రమాదకరం, అత్యంత ప్రమాదకరం అనే హెచ్చరికలను జారీ చేస్తుంది. ఈ యాప్‌ను త్వరలోనే ఉచితంగా విడుదల చేస్తామని డాక్టర్‌ అభినవ్‌ ధావ్‌ వెల్లడించారు.