సుప్రీం తీర్పును అవమానిస్తున్న బీజేపీ, సంఘ్ పరివార్...

12:01 - October 12, 2018

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు అనుమతినిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ తీర్పును సైతం మతోన్మాదానికి ముడిపెట్టి బీజేపీ, సంఘ్ పరివార్... శక్తులు రాజకీయం చేస్తున్నాయి. దీంతో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) అమీతుమీకి సిద్ధమవుతోంది. యూడీఎఫ్, బీజేపీ ప్రచారాన్ని రాజకీయంగానే తిప్పికొట్టేందుకు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16 నుంచి ' పొలిటకల్ ఎక్స్‌ప్లనేటరీ మీటింగ్స్' నిర్వహించాలని ఎల్డీఎఫ్ నిర్ణయించింది. ఈ మేరకు ఎల్డీఎఫ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం నిర్ణయాన్ని ఎల్డీఎఫ్ కన్వీనర్ ఎ.విజయరాఘవన్ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన సమావేశం జరిగినట్టు ఆయన చెప్పారు.  ' సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ అంశంలో గత ప్రభుత్వాలు కూడా వివిధ కోర్టు ఉత్తర్వులను అమలు చేసింది. ప్రభుత్వంపై కుట్ర లక్ష్యంగా బీజేపీ-ఆర్ఎస్ఎస్, యూడీఎఫ్ ప్రస్తుతం ఆందోళనలు జరుపుతున్నాయి. విశ్వాసల పేరుతో ప్రజలను వీధుల్లోకి లాక్కొస్తున్నారు ' అని విజయరాఘవన్ ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి భయంతోనే వారిని తప్పుదారి పట్టించేందుకు బీజేపీ, యూడీఎఫ్ ప్రయత్నిస్తున్నాయని అన్నారు. మహిళల ఆలయ ప్రవేశంపై తమ వైఖరి స్పష్టంగానే ఉందని, ఎస్సీ తీర్పు నేపథ్యంలో ఎల్‌డీఎఫ్ వైఖరిని ప్రజల ముందుకే తీసుకువెళ్లామని, ఇందుకు అనుగుణంగా పొలికటల్ ఎక్స్‌ప్లనేటరీ సమావేశాలు ఈనెల 16 నుంచి 30 వరకూ చేపడతామని చెప్పారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈనెల 16న తిరువనంతపురం, 23న పదనాంతిట్ట, 24 న కొల్లాంలో జరిగే సమావేశాల్లోనూ, మంత్రులు, లెఫ్ట్ నేతలు ఇతర జిల్లాల్లో జరిగే సమవేశాల్లోనూ పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎల్‌డీఎఫ్ వైఖరి, సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన బ్రోచర్లు పంచుతామని, అలాగే పలు కుటుంబాలతో సమావేశమై పరిస్థితిని వివరిస్తామని కూడా చెప్పారు.