సుప్రీంలో రాఫెల్‌పై మోడీకి ఎదురుదెబ్బ ?

16:34 - October 10, 2018

రాఫెల్‌ ఒప్పంద విషియంలో ఈరోజు మోడీ సర్కార్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. గడిచిన కొద్దిరోజులుగా మోడీ సర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోల ఎపిసోడ్ సాగుతున్న సంగతి తెలిసిందే. రాఫెల్ ఒప్పందం వివరాల్ని వెల్లడించాలని దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలని కేంద్రం చేసిన వినతిని సుప్రీం రిజెక్ట్ చేసింది. అంతేకాదు.. కేంద్రం ఊహించని విధంగా రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబందించిన వివరాల్ని సీల్డ్ కవర్ లో తమకు సమర్పించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. రాఫెల్ డీల్ కు సంబంధించిన వివరాల్ని కేంద్రం వెల్లడించాలంటూ ఎంఎల్ శర్మ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణ (అక్టోబరు 31)కు ముందు అంటే అక్టోబరు 29లోపు కేంద్రం సమాధానం చెప్పాలని గడువు విధించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం.. ఫ్రాన్స్ చేరే వరకూ సాగిన నిర్ణయాలు.. ఆఫ్ సెట్ భాగస్వామిగా భారత కంపెనీ ప్రమేయం వంటి వివరాలు తమకు సమర్పించే సీల్డ్ కవర్ లో ఉండాలని సుప్రీం పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. రాఫెల్ డీల్ జాతీయ భద్రతకు సంబంధించిందని.. దీన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. అయితే.. ఆయన వాదనల్ని వింటూనే.. కేంద్రం డీల్ వివరాల్ని సీల్డ్ కవర్లో తమకు అందజేయాలని పేర్కొనటం మోడీ సర్కారుకు ఎదురుదెబ్బగా పలువురు అభివర్ణిస్తున్నారు.