సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో భారీ అక్రమాలు!

15:53 - October 31, 2018

తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఫండ్ ను ఎవరెవరికి విడుదల చేశారనే లెక్కలు కూడా ప్రభుత్వం దగ్గర లేవని తెలుస్తోంది. 2014 జూన్ నుంచి 2015 ఆగస్టు మధ్య సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరెవరికి సాయం అందిందో తెలియజేయాలంటూ విజయ్ గోపాల్ అనే ఉద్యమకారుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. సదరు నిర్దిష్ట కాలంలో తెలంగాణ రెవెన్యూ శాఖ సీఎం సహాయ నిధి కింద మొత్తం 12462 చెక్కులను క్లీయర్ చేసిందని.. వాటి విలువ రూ.84.94 కోట్లని ఆయనకు సమాధానం అందింది. కానీ ప్రభుత్వం దగ్గర మాత్రం కేవలం 182 చెక్కుల లబ్ధిదారుల వివరాలే  ఉన్నాయి. మిగతా లబ్ధిదారులెవరు? ఏ కారణాలతో వారికి సహాయ నిధి అందజేశారు? అనే ప్రశ్నలకు సమాధానమే కరవైంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ వ్యక్తి గణేశ్ నిమజ్జన వేడుకలో నీటిలో మునిగి చనిపోగా.. అతడి కుటుంబ సభ్యులకు రూ.లక్ష సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ అందింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వారికి సహాయాన్ని సిఫార్సు చేశారు. రాష్ట్రంలో ఇంతమంది కష్టాల్లో ఉండగా.. రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతుండగా ఎక్కడో అమెరికాలో జరిగిన దుర్ఘటనలో మృతిచెందినవారికి సహాయం చేస్తూ నిధుల దుర్వినియోగం చేయడమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి సీఎం సహాయనిధిని అందుకోవాలంటే దరఖాస్తుదారులు తమ రేషన్ కార్డు వివరాలు - ఫోన్ నెంబరు - బ్యాంకు ఖాతా వంటివి సమర్పించాలని.. ఈ నిబంధనలన్నింటినీ తుంగలోకి తొక్కి ప్రభుత్వం ఇష్టారీతిన నిధులు మంజూరు చేసిందని విజయ్ ఆరోపించారు. ఇదిలా వుంటే...ఇక మరికొన్ని చెక్కులు నేరుగా ఆస్పత్రుల బ్యాంకు ఖాతాల పేరిట విడుదలయ్యాయి. ఎవరికి చికిత్స అందించేందుకు వాటిని జారీ చేశారనే సంగతి వాటిపై లేనే లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ లో భారీ కుంభకోణం చోటుచేసుకుందని చెప్పేందుకు ఇవే సాక్ష్యాలని విజయ్ చెబుతున్నారు.