సిబిఐ కొత్త డైరెక్టర్‌గా మన తెలుగు బాస్‌

11:30 - October 24, 2018

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ఈరోజు తెల్లవారుజామున రెండు గంటలకే నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. చార్జ్ తీసుకుంది మొదలు రంగంలోకి దిగారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 10, 11 అంతస్థుల్లోని అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా గదుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తరువాత రెండు గదులను సీజ్ చేశారు. సీబీఐ నూతన డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ, సీబీఐ ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా కేడర్‌కు చెందిన నాగేశ్వరరావు తెలుగువారు కావడం విశేషం. 1986లో సివిల్స్ రాసి  మన్నెం ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 1986లో ఒడిశా కేడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యాక ఎక్కువగా చత్తీస్‌గఢ్‌లోనే విధులు నిర్వహించారు మన్నెం. దక్షిణాది రాష్ట్రాల జేడీ బాధ్యతల నుంచి లక్ష్మీనారాయణ తప్పుకున్న తర్వాత ఆయన స్థానంలో మన్నెం నాగేశ్వరరావును నియమించారు. ఇప్పటి వరకు సీబీఐ అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావు..ఇప్పుడు సీబీఐ డైరెక్టర్‌గా కేంద్రం ఆదేశాలతో పదవీ బాధ్యతలు అందుకున్నారు. ఈయన స్వస్థలం వరంగల్ జిల్లా మంగపేట మండలం బోరెనర్సాపూర్ గ్రామం. ఏడాదిన్నరగా సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఇప్పుడు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.