' సర్కార్‌ 'తో మరో ట్విస్ట్‌...!

13:27 - November 10, 2018

విజయ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు మురుగుదాస్‌ తెరకెక్కించిన చిత్రం ' సర్కార్‌ '. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని విడుదలైన తరువాత దీనిపై వివాదాలు మొదలయ్యాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు అన్నాడీఎంకే ప్రభుత్వ పథకాలను విమర్శించే విధంగా ఉన్నాయని వెంటనే వాటిని తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు ' సర్కార్‌ ' సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల ముందు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కార్యకర్తలు విజయ్ కటౌట్లను ధ్వంసం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఉచిత పథకాలకు సంబంధించి సినిమాలో విజయ్ చెప్పే డైలాగ్స్‌ను, సీన్స్‌ను చిత్రబృందం తొలగించింది. తమ హీరో సినిమా పోస్టర్లను తగలబెట్టడం, కటౌట్లను ధ్వంసం చేసి.. సీన్లు కట్ చేయడానికి కారణమైన అన్నాడీఎంకే ప్రభుత్వ వైఖరిపై విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. దీంతో అన్నాడీఎంకే ఎన్నికల సమయంలో ఇచ్చిన ల్యాప్‌టాప్‌లు, ఫ్యాన్లు, మిక్సీలను రోడ్లపైకి విసిరికొట్టిన విజయ్ అభిమానులు.. మీ ఉచిత వస్తువులు మాకొద్దంటూ అన్నాడీఎంకే పట్ల తమ నిరసన వ్యక్తం చేశారు. మరికొందరు అభిమానులు జయలలిత హయాంలో ఇచ్చిన టేబుల్‌ ఫ్యాన్స్, టీవీలు, గ్రైండర్లను తగులబెట్టారు. తమ అభిమాన హీరో సినిమా సన్నివేశాలను తొలగించడానికి కారణమైన అన్నాడీఎంకే ప్రభుత్వానికి నిరసనగా ఇలా చేసినట్లు వీడియోలో అభిమానులు చెబుతున్నారు. ఈ చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు పోస్ట్ చేశారు.