శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టకుండా వెనక్కి వెళ్లే ప్రసక్తేలేదు : తృప్తి దేశాయ్‌

11:10 - November 16, 2018

శబరిమల ఆలయ దర్శనం కోసం కొచ్చి విమనాశ్రయానికి చేరుకున్న మహిళా హక్కుల కార్యకర్త తృప్తిదేశాయ్‌కు స్వామి అయ్యప్ప భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. భక్తుల దర్శనార్థం ఇవాళ శబరిమల ఆలయం తెరుచుకోనుండడంతో.. అటు ఆలయం పరిసరాల్లోనూ, ఇటు కొచ్చి విమానాశ్రయంలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో శాంతి భద్రతల పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. తాను శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టకుండా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదని తృప్తి చెబుతున్నారు. శబరిమలను దర్శించుకోనున్నట్టు తృప్తి ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, రాష్ట్ర పోలీస్ చీఫ్‌లకు లేఖ రాశారు. తనకు భద్రత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. పుణేకి చెందిన '  భూమాత బ్రిగేడ్ ' అధ్యక్షురాలు తృప్తి దేశాయ్... తన బృందంతో కలిసి 2016లో మహారాష్ట్రలోని శని సింగణాపూర్ ఆలయంలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. 60  ఏళ్ల నుంచి ఇక్కడి ఆలయంలో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న నిషేధానికి ఆమె ముగింపు పలికారు. నాటి నుంచి తృప్తిని స్ఫూర్తిగా తీసుకుని అనేక చోట్ల మహిళలపై కొనసాగుతున్న నిషేధాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు ఆందోళనకారులకు మద్దతు తెలిపిన ట్యాక్సీ డ్రైవర్లు...తృప్తి దేశాయ్‌ని, ఆమె బృందాన్ని విమనాశ్రయం నుంచి బయటికి తీసుకెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఇదిలా వుంటే... శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వివాదాస్పద తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.