వైజాగ్‌ ప్రసాద్‌ కన్నుమూత

11:19 - October 21, 2018

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. ప్రస్తుతం ప్రసాద్ మృతదేహం నిమ్స్ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. ఆయన కుమారుడు, కూతురు అమెరికాలో ఉండడంతో వారు వచ్చే వరకు మృతదేహాన్ని నిమ్స్‌లోని మార్చురీలోనే ఉంచుతారు.' మా ' తరుపున వైజాగ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ' మా ' అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ డా. వి.కె. నరేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున బాత్ రూంకు వెళ్లిన ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఆ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైజాగ్ ప్రసాద్ పూర్తిపేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. విశాఖపట్నంలోని గోపాలపట్నం ఇతని స్వగ్రామం.  ఈయన గౌరి, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, అత్తారింటికి దారేది, శివరామరాజు, నువ్వునేను, భద్ర, పెదబాబు తదితర చిత్రాల్లో నటించారు.