వేదిస్తున్నారని ఎదురుతిరిగితే..పెట్రోలు పోసి నిప్పంటించారు

16:31 - December 3, 2018

ఓ మహిళను వెంటపడి వేధించిన కామాంధులు ఆమె తిరగబడటంతో రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినందుకు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెలితే...సీతాపూర్‌ లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్న ఓ మహిళను అదే ప్రాంతానికి చెందిన రాము, రాజేశ్ లు కొంతకాలంగా వేధిస్తున్నారు. అయితే వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు తిరగబడింది. దుండగుల నుంచి తప్పించుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు స్వీకరించేందుకు సీతాపూర్ పోలీసులు నిరాకరించారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయగా, అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఇంకోసారి సీతాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అధికారులు ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో బాధిత కుటుంబం మనస్తాపంతో ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో బాధితురాలి ఇంటికెళ్లిన దుండగులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. కుటుంబ సభ్యులు బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స ప్రారంభించారు. 60 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో చోటుచేసుకుంది. మరోవైపు  ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిందితులపై లైంగికవేధింపులు, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాము, రాజేశ్ పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.