విజయ్ కి ' నోటా ' ఒక పాఠం!

13:15 - October 9, 2018

విజయ్ దేవరకొండకి ' నోటా ' ఒక పాఠం నేర్పిందనే అనుకోవాలి. ఎందుకంటే స్టార్‌ హీరోలు ఒక మార్కెట్‌లో తమను తాము ప్రూవ్‌ చేసుకున్నాక మరొక భాషలో జెండా పాతాలనుకోవడం సహజం. అయితే అది ఎప్పుడు, ఎలాంటి సమయంలో అటువైపు వెళ్లాలో నిర్ణయించుకోవడం ఇక్కడ ముఖ్యం. మన దేవరకొండ ఇక్కడే తప్పులో కాలేసిండు. ఓవర్సీస్ తో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా మన సినిమాలు బాగా ఆడుతున్నాయి. దీంతో సహజంగానే కొందరికి స్ట్రెయిట్ సినిమా చేయాలనే తలంపు రావడం సహజం. దీనికి శ్రీకారం చుట్టింది అల్లు అర్జునే. లింగుస్వామి దర్శకత్వంలో బై లింగ్వల్ ప్రకటించి కాస్త హడావిడి చేసి తర్వాత ఆ ఆలోచనకు  దీర్ఘకాలిక వాయిదా వేసేసాడు.  కానీ మహేష్ బాబు మాత్రం ధైర్యం చేసి మురుగదాస్ అండతో చేసిన స్పైడర్ చేదు ఫలితాన్ని ఇచ్చి పడిన కష్టం మొత్తం నేలపాలయ్యేలా చేసింది.  మహేష్ అయినా పాతిక సినిమాలు దగ్గర ఉన్నప్పుడు కోలీవుడ్ లో అడుగు పెట్టే సాహసం చేసాడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం పట్టుమని పది దాటకుండానే నోటాతో రిస్క్ కు రెడీ అన్నాడు.  కేవలం రెండు యావరేజ్ సినిమాల అనుభవం ఉన్న ఆనంద్ శంకర్ ను నమ్మి చేసిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకోకుండా కథా కథనాలు నడిపించడంతో రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయింది.  నిజానికి తమిళ ప్రజలు  ఇతర బాషా హీరోలను నెత్తిన  బెట్టుకోవడం చాలా అరుదు. ప్రాంతీయాభిమానం నరనరాల్లో ఉండే వాళ్ల కంటికి తెలుగు హీరోలు ఆనరు. మనవాళ్ళ సహృదయత వేరు. అందుకే కమల్-రజని-సూర్య-విక్రమ్-విశాల్ లాంటి వాళ్ళకు ఇక్కడ కూడా ఫాలోయింగ్ ఉంది. అందుకే మనవాళ్ళు సాధ్యమైంత మేరకు ఈ అరవ యావకు దూరంగా ఉంటేనే బెటర్ ముఖ్యంగా విజయ్ దేవరకొండ  లాంటి హీరోలు ఇంట  గెలవాల్సింది చాలా ఉంది.  తర్వాత రచ్చ చేయడం  గురించి ఆలోచించవచ్చు . నోటా ఈ విషయంలో మరో పాఠంలా ఉపయోగపడుతోంది .