వర్మపై కేసు పెట్టిన షణ్ముక ప్రియ

17:18 - October 8, 2018

 షణ్ముక ప్రియ..ఈమె వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌ సమయంలో ఆయన గురించి పోలీసులకు కీలక సమాచారం ఇచ్చిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఈమె రామ్‌ గోపాల్‌ వర్మపై కేసు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే... కర్ణాటక తమిళనాడుతో పాటు సౌత్ రాష్ట్రాలను గడగడలాడ్డించిన  వీరప్పన్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో  ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా స్క్రిప్ట్ వర్క్ సమయంలో వర్మ  షణ్ముక ప్రియ నుండి కీలకమైన సమాచారంను రాబట్టుకున్నాడు.  ఆమె ఇచ్చిన కీలక పాయింట్ల కారణంగా చాలా నేచురల్ గా సినిమా ఎన్ కౌంటర్ సీన్స్ వచ్చాయని కూడా కన్నడంలో టాక్ వచ్చింది. ఇప్పుడు ఆమె వర్మపై కేసు వేసింది. వీరప్పన్ చిత్రం సమయంలో తన నుండి సమాచారం తీసుకున్నందుకు భారీ మొత్తంలో నాకు పారితోషికం ఇస్తాను అంటూ వర్మ ఒప్పందం చేసుకున్నాడు. అందుకు గాను ఒక లక్ష రూపాయల అడ్వాన్స్ ఇచ్చాడు. అగ్రిమెంట్ చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మిగిలిన బ్యాలన్స్ ఇవ్వడం లేదు. వర్మను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే తర్వాత కొన్ని రోజులు ఆగు అంటూ సమాధానం వస్తుందని షణ్ముక ప్రియ చెప్పుకొచ్చింది. అందుకే ఇక చివరి ప్రయత్నంగా కేసు ఫైల్ చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. వర్మ సంగతి ఇలా వుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తనని మోసం చేశాయంటూ షణ్ముక వెల్లడించింది. వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌ సమయలో కీలక సమాచారం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం 5 కోట్లు మరియు ఒక ఉద్యోగం ఇస్తామని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మేరకు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించాయి. కానీ ఇప్పటివరకూ ఏ ఒక్కరి నుండి సాయం అందలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు మోసం చేయడంతో పాటు వర్మ కూడా తనను మోసం చేశాడు అంటూ షణ్ముక ప్రియ పేర్కొంది.