వంటేరు ప్రతాప్‌రెడ్డికి షాక్‌!..

13:01 - November 25, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు డిసెంబర్‌ 7న జరగనున్నవి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కదలికలపై పోలీసులు, ఎన్నికల కమీషన్‌ ఒక కంట కనిపెడుతునే వున్నారు. ఇదే సందర్భంలో గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డికి షాక్‌ తగిలింది. పోలీసుల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా, సదరు వ్యక్తి ప్రతాప్‌రెడ్డి ప్రధాన అనుచరుడని భావిస్తున్నారు.  ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని ఒంటి మామిడి వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సులోని ప్రయాణికులను, వారి బ్యాగులను తనిఖీ చేయగా హనుమంతు అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో రూ.20 లక్షల నగదు గుర్తించారు. దీంతో హనుమంతుని పోలీసులు అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతను వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రధాన అనుచరుడని తెలుస్తోంది.