రేవంత్‌ రెడ్డి ఎక్కడ ?: తెలంగాణ పోలీసులకు హైకోర్టు ప్రశ్న

15:39 - December 4, 2018

తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్టుపై హైకోర్టులో వాడీవేడిగా వాదనలు కొనసాగాయి. రేవంత్ రెడ్డిని అర్థరాత్రి బలవంతంగా పోలీసులు ఈడ్చుకుని వెళ్లారని ఆయన తరఫున లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పకుండా కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేశారన్నారు. అర్థరాత్రి ఓ పార్టీ నేతను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. అంతేకాదు...  ఏ ఆధారాలతో రేవంత్ ను అరెస్ట్ చేశారో చెప్పాలని న్యాయస్థానం కోరింది. దీంతో.... ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. రేవంత్ కారణంగా కొడంగల్ లో అల్లర్లు తలెత్తే అవకాశం ఉందని తమకు ఇంటెలిజన్స్ వర్గాల నుంచి నివేదిక అందిందని తెలిపారు. కొడంగల్ లోని కోస్గీలో ఈ రోజు జరిగే ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం రేవంత్ రెడ్డిని ఎక్కడ ఉంచారో తెలపాలని ఆదేశించింది. అలాగే అల్లర్లపై ఇంటెలిజెన్స్ అందించిన నివేదికను తమముందు ఉంచాలని సూచించింది.